కేసీఆర్‌కి స‌రైన మొగుడు ఈయనేనా?

తెలంగాణ‌లో త‌న‌కు తిరుగులేద‌ని భావిస్తున్న సీఎం కేసీఆర్ కు మొగుడు రెడీ అయ్యాడు. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యం స‌హా ఇటు మాస్ అటు క్లాస్ ఇమేజ్ ఉన్న ప్రొఫెస‌ర్ కోదండ రాం ఇప్పుడు కేసీఆర్‌కు మొగుడుగా మారారు. రాష్ట్రంలో విప‌క్షాలు చేయ‌లేని ప‌ని ఇప్పుడు ఏ పార్టీకీ చెంద‌ని కోదండ‌రాం చేస్తున్నారు. కేసీఆర్ నిత్యం నెత్తిన కుంప‌టిలా త‌యార‌య్యాడు ఈయ‌న‌. కేసీఆర్ అవ‌లంబిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై కోదండ‌రాం ఉద్య‌మానికి సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్‌తో భుజం భుజం రాసుకుని తెలంగాణ సాధ‌న‌కు తానుసైతం స‌మిధ‌ను స‌మ‌కూర్చిన కోదండ‌రాం ఇప్పుడు ఇలా రివ‌ర్స్ గేర్ మార్చారు.

వాస్త‌వానికి తెలంగాణ ఉద్య‌మంలోకి కోదండ రాం ను తీసుకువ‌చ్చిందే కేసీఆర్. అయితే, ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత మాత్రం కేసీఆర్‌కి కోదండ‌రాంకి గ్యాప్ పెరుగుతూ వ‌చ్చింది. ముఖ్యంగా తనకంటే ఇమేజ్‌ పెంచేసుకుంటున్నారన్న అక్కసుతో కోదండరాంపై అక్క‌సు పెంచుకున్నారు కేసీఆర్‌. ఇదిలావుంటే, తెలంగాణ వచ్చినా తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ ప్రభుత్వం ఎలాంటి మేలూ చేయ‌డం లేద‌ని కోదండ‌రాం బ‌హిరంగంగానే విమ‌ర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం మీద ‘యుద్ధం’ ప్రకటించారు. మల్లన్నసాగర్‌ విషయంలో కోదండరాం దెబ్బకి, కేసీఆర్‌ సర్కార్‌ బెంబేలెత్తిందని చెప్పక తప్పదు. చాలా విషయాల్లో కోదండరాం కంట్రోల్‌ చేయలేని స్థితిలో చేరిపోయింది ప్ర‌భుత్వం.

ఇక‌, హైద‌రాబాద్‌లోని ధ‌ర్నా పార్కును మార్చిన‌ప్పుడు కూడా ప్ర‌తిప‌క్షాల‌తో క‌లిసి కోదండ‌రాం ఉద్య‌మించారు. రాష్ట్రంలో అన్ని విప‌క్షాలూ పెద్ద ఎత్తున ఉద్య‌మించినా కేసీఆర్ ఏమీ అనుకోలేదు. కానీ త‌న‌తోపాటు ఉద్య‌మాన్ని న‌డిపించి, తెలంగాణ ఏర్పాటుకు స‌హ‌క‌రించి, త‌న మ‌న‌సు ఎరిగిన కోదండ‌రాం తిరుగుబావుటా ఎగుర‌వేసే స‌రికి క‌దిలిపోయారు. ఆయ‌న‌ను ఎలా కంట్రోల్ చేయాలాని త‌ల‌ప‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే కోదండరాం ఇమేజ్‌ని ఎక్కడికక్కడ డైల్యూట్‌ చేయడానికి కేసీఆర్‌ సర్కార్‌ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా, అమరవీరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొనేందుకు నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డికి వెళ్ళేందుకు కోదండరామ్‌ ప్రయత్నిస్తే, ఆ ప్రయత్నాన్ని నీరుగార్చారు పోలీసులు. మార్గమధ్యంలోనే కోదండరామ్‌ని అరెస్ట్ చేసే హైడ్రామాకు తెర‌తీశారు.

తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందనీ, యాత్రకి అనుమతివ్వని పోలీసులు, ఓ మీటింగ్‌లో పాల్గొనేందుకు వెళుతున్న తనను అరెస్ట్‌ చేయడమేంటని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు కోదండ‌రాం. అయితే, కోదండరాం యువతను, తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నది కేసీఆర్‌ సర్కార్‌ వాదన. ఎవరేమనుకున్నా, తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదని, తెలంగాణ ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తూనే వుంటానని కోదండరాం తెగేసి చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా రాజకీయ పార్టీల వెన్ను విరిచేయగలిగిన కేసీఆర్‌, కోదండరాం విషయంలోనే ఏ ప్రయత్నం చేసినా ఫ‌లించ‌డం లేదు.

మొన్నామ‌ధ్య టీవీ చాన‌ల్ స్థాపించేందుకు కూడా కోదండ రాం ఏర్పాట్లు చేసుకున్నారు. అదేస‌మ‌యంలో ఆయ‌న పార్టీకూడా పెడ‌తార‌ని కొంద‌రు, లేదు .. ఇప్పుడున్న పార్టీలోనే చేర‌తార‌ని మ‌రికొంద‌రు అన్నారు. ఏదేమైనా 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో తెలంగాణ‌లో కేసీఆర్‌కి ఎదురు లేద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు అనూహ్యంగా ఇలా కోదండ రాం తెర‌మీద‌కి రావ‌డం, అందునా కేసీఆర్ అండ్ కోకి కొర‌క‌రాని కొయ్య‌గా మార‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్న విష‌యం. మ‌రి భిష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.