నంద్యాల‌లో ఓట‌ర్ల‌ క్యూలే క్యూలు.. బాబు, జ‌గ‌న్‌కు టెన్ష‌న్‌… టెన్ష‌న్‌

నిన్ని మొన్న‌టి వ‌రకు అంద‌రూ రావాలి ఓటు హ‌క్కు వినియోగించుకావాలి.. అంటూ భారీ ఎత్తున రీసౌండ్ వ‌చ్చే మైకులు పెట్టుకుని మ‌రీ ఊరూ వాడా తిరుగుతూ నంద్యాల జ‌నాల చెవుల్ని హోరెత్తించిన టీడీపీ, వైసీపీల్లో తీరా ఇప్పుడు ఓటింగ్ మొద‌ల‌య్యే స‌రికి భ‌యం ప‌ట్టుకుంది! దీనికి కార‌ణం నంద్యాల ఓట‌ర్లే!! గ‌తంలో ఎన్న‌డూ క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో నంద్యాల ఓట‌ర్లు.. పోలింగ్ బూతుల ముందు క్యూల మీద క్యూలు క‌ట్టారు. పండు ముస‌లోళ్ల నుంచి యువ‌కులు, యువ‌తుల వ‌ర‌కు అంద‌రూ పోలింగ్ కేంద్రాల‌ను వెతుక్కుని మ‌రీ వెళ్తున్నారు. అంతేకాదు, అత్యంత కీల‌కంగా భావిస్తున్న గోస్పాడు మండ‌లంలో అయితే, బూత్ గేట్ తాళాలు కూడా తీయ‌కుండానే క్యూలు క‌ట్టేశారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అంచ‌నా వేయొచ్చు!

దీనిని స్వాగ‌తించాల్సిన ప‌రిణామం అని ప్ర‌జాస్వామ్య వాదులు, ఎన్నిక‌ల సంఘం హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంటే.. ఇక్క‌డ ప్ర‌ధానంగా త‌ల‌ప‌డుతున్న వైసీపీ, టీడీపీలు మాత్రం.. త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. దీనికి కార‌ణం.. ఎక్కువ ఓట్లు ప‌డితే ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం అనే అంచ‌నాలు పెరిగిపోవ‌డ‌మే! బుధవారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. కేవ‌లం ఉప ఎన్నిక, అదికూడా ఏడాదిన్న‌ర కోసం జ‌రుగుతున్న పోలింగ్. ఇది పైకి క‌నిపిస్తున్న విష‌యం. కానీ, దీనిని రెండు ప్ర‌ధాన పార్టీలు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

అభివృద్ధి, అన్యాయాల నినాదాల‌తో అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీలు బ‌రిలోకి దిగాయి. గ్రామ‌గ్రామ‌మే కాదు, గ‌డ‌ప గ‌డ‌ప‌ను తొక్కారు ఇరు పార్టీల నేత‌లు. ల‌క్ష‌లు కాదు.. కోట్ల క‌ట్ట‌ల‌ను తెంచేశారు. అడిగిన వారికి అడిగినంత అన్న‌ట్టుగా డ‌బ్బును పంచేశారు. గిఫ్ట్‌లూ ఇచ్చేశారు. అయితే, అనుకున్న‌ది ఒక‌టి.. జ‌రుగుతోంది ఒక‌టి అన్న‌ట్టుగా త‌యారైంది ప‌రిస్థితి. దీనికికార‌ణం.. పోలింగ్ బూతుల ముందు పోటెత్తారు. ఇప్పుడు ఈ ప‌రిణామ‌మే టీడీపీ, వైసీపీల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. సాధార‌ణ ఓటింగ్ శాతాన్ని మించిపోతుంద‌న్న త‌రుణంలో వారికి గెలుపోట‌ముల భ‌యం ప‌ట్టి పీడిస్తోంది. పోలింగ్ శాతం పెరిగితే సర్కారుపై కసితో ఓటర్లు తమ హక్కు ఉపయోగించుకోవటానికి ముందుకొచ్చినట్లు అవుతుందని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

ఇక‌, టీడీపీ వెర్ష‌న్ వేరే విధంగా ఉంది. అభివృద్ధి మంత్రానికి నంద్యాల ఓట‌ర్లు ఆక‌ర్షితుల‌య్యార‌ని, కాబ‌ట్టే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో క్యూ క‌ట్టార‌ని చెబుతోంది. ఈ ఓట్ల‌న్నీ త‌మ అభివృద్ధికేన‌ని ఢంకా బ‌జాయిస్తోంది. దీంతో ఇప్పుడు ఓట్ల శాతం పెంపు కూడా ప్ర‌ధానంగా రిజ‌ల్ట్ ను ప్ర‌భావితం చేస్తుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఎక్కువ శాతం ఓట్లు ప‌డితే.. త‌మ‌కంటే.. త‌మ‌కే లాభ‌మ‌ని ఇరు పార్టీల్లోనూ భ‌రోసా క‌నిపిస్తునా.. లోలోన మాత్రం.. ఓట్లు చీలిపోయే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని గ‌త అనుభ‌వాల‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఏదేమైనా.. ఓట‌రు నాడి ప‌ట్ట‌డం ఎవ‌రి త‌ర‌మూ కాద‌ని చెప్ప‌డానికి నంద్యాల ఉదాహ‌ర‌ణ‌గా మిగ‌ల‌నుంద‌నేది రాజ‌కీయ సీనియ‌ర్లు చెబుతున్న ఉవాచ‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.