40 ఏళ్ల అనుభ‌వంలో ఎప్పుడూ లేని కంగారు..!

న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభవంలో ఎప్పుడూ ప‌డ‌ని కంగారు.. ఇప్పుడు ప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో ఎన్నో ఉప ఎన్నిక‌లను అవ‌లీల‌గా హ్యాండిల్ చేసిన ఆయ‌న‌.. ఇప్పుడు ఒకే ఒక్క ఎన్నిక‌లో గెలుపు కోసం ఎంతో టెన్ష‌న్ ప‌డుతున్నారు. అమ‌రావ‌తి, పోల‌వరం అని నిత్యం చెప్పే ఆయ‌న‌.. ఇప్పుడు నంద్యాల‌.. నంద్యాల అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు!! క‌నీవినీ ఎరుగని రీతిలో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ నియోజ‌క‌వ‌ర్గానికి ఇవ్వ‌ని రేంజ్‌లో నంద్యాల‌పై వ‌రాల జ‌ల్లులు కురిపిస్తున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు!! ప్ర‌తి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. స‌చివాల‌యంలో ఉన్నా బాబు మ‌న‌సంతా నంద్యాల మీదే ఉంది. ఆయ‌న‌ ఎందుకింత ఆత్రుత చూపిస్తున్నారు అనే అంశం ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న త‌రుణంలో.. ఈ ఉప ఎన్నిక ఇరు పార్టీల‌కు అత్యంత కీల‌కంగా మారింది. నంద్యాల ఉప ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. టీడీపీ, వైసీపీ నేత‌ల్లో ఉత్కంఠ పెరుగుతోంది. విజ‌యంపై ఇరు పార్టీలు.. ధీమాగా ఉన్నాయి. విజ‌యం మాదంటే మాది అని బ‌ల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. ఇరు పార్టీల నేత‌లు దీనిని సవాల్‌గా తీసుకోవ‌డంతో హీట్ పెరుగుతోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. నంద్యాల‌లోనే మ‌కాం వేశారు. వారం రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా.. ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. నిత్యం అమ‌రావ‌తి నుంచే ప‌రిస్థితి స‌మీక్షిస్తున్నారు.

చంద్రబాబు సీఎంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఉప ఎన్నికలు చూశారు. అవేవీ ఆయనను ఇంత టెన్షన్ పెట్టలేదు. రాష్ట్ర విభజనానంతరం జరుగుతున్న తొలిపోరు నంద్యాల ఉప ఎన్నిక అనే చెప్పాలి. ఈ ఫలితాన్ని పాలనకు రెఫరెండంగానే భావించాలి. అందుకోసమే చంద్రబాబు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచే నంద్యాలపై దృష్టి పెట్టారు. అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత రెండు సార్లు ప‌ర్య‌టించాలి. దాదాపు 1300 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధిపనులను కూడా నంద్యాలకు మంజూరు చేశారు. కాని ఆయనకు ఎక్కడో అనుమానం ఉండటంతోనే నంద్యాల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు టీడీపీ నేతలు.

ఇప్పుడు చంద్రబాబు ఏ సమావేశం పెట్టినా ఆయన నోటి నుంచి వచ్చేవి మూడే మాటలు. ఒకటి అమరావతి, రెండు పోలవరం, మూడు నంద్యాల. రోజూ మంత్రులు, టెలీకాన్ఫ‌రెన్స్ ల‌లో నంద్యాల విషయంపై చర్చిస్తున్నారు. తాను నివాసంలో ఉన్నా, సచివాలయంలో ఉన్నా… నంద్యాల నుంచి ఫోన్ అంటే అటెండ్ అయ్యేలా ఏర్పాటు చేసుకున్నా రు. ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ, ఆ నివేదికలను అధ్యయనం చేస్తూ త‌ప్పులను సరిదిద్దుతున్నారు . ఒక పక్క మైండ్ గేమ్ ఆడుతూనే మరొక పక్క పార్టీ నేతలకు సూచనలను చేస్తున్నారు. ఇక మ‌రో రెండు రోజుల పాటు నంద్యాల‌లో ప‌ర్య‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.