బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిగా తెలుగు వ్య‌క్తి..!

దేశ‌వ్యాప్తంగా అప్ర‌తిహ‌త రాజ‌కీయ వ్యూహాల‌తో దూసుకుపోతోన్న బీజేపీకి కొత్త జాతీయ అధ్య‌క్షుడు వ‌చ్చే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. ప్రస్తుతం జాతీయాధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా మోడీ కేబినెట్‌లో మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మోడీ కేబినెట్‌లో కీల‌క‌మైన శాఖ‌ల‌కు మంత్రులు లేరు. ప్ర‌స్తుతం ఆ బాధ్య‌త‌ల‌ను అద‌నంగా వేరే వాళ్ల‌కు అప్ప‌గించారు. ఈ నేప‌థ్యంలో గ‌త మూడేళ్లుగా పార్టీని అత్యంత స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపించిన అమిత్ షాను మోడీ త‌న కేబినెట్‌లోకి తీసుకునేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది.

షా గుజ‌రాత్ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న రాజ్య‌స‌భ‌కు వెళ్లిపోతే బీజేపీకి కొత్త జాతీయ అధ్య‌క్షుడి అవ‌స‌రం ఏర్పుడుతంది. ఈ జాబితాలో ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన రాం మాధ‌వ్ పేరు కూడా వినిపిస్తుండ‌డం విశేషం. రాం మాధ‌వ్‌ది ఆర్ఎస్ఎస్‌లో బ‌ల‌మైన నేప‌థ్యం. ఆయ‌న మోడీకి అత్యంత స‌న్నిహిత‌మైన వ్య‌క్తుల్లో ఒక‌రు.

మోడీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఆయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. మోడీ విదేశీ పర్యటనల సందర్భంగా ఏర్పాట్లను చేయడంలో కూడా రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఈయనకు జాతీయాధ్యక్ష పదవి దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. సంథ్ మ‌ద్ద‌తు ఉంది, మోడీ చెప్పిన‌ట్టు న‌డుచుకునే వ్య‌క్తి, అందులోను సౌత్‌కు చెందిన వ్య‌క్తి కావ‌డంతో మోడీ రాం మాధ‌వ్‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్ష ప‌గ్గాలు అప్ప‌గించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

సౌత్‌లో ఎదిగేందుకు ఎప్ప‌టి నుంచో కాచుకుని కూర్చొన్న బీజేపీ ఇప్పుడు అదే సౌత్‌కు చెందిన రాం మాధ‌వ్‌కు బీజేపీ జాతీయ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ద్వారా ఇక్క‌డ ప‌ట్టుబిగించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక అమిత్ షాకు మోడీ కేబినెట్‌లో కీల‌క‌మైన ర‌క్ష‌ణ శాఖ ద‌క్క‌నుంద‌ని తెలుస్తోంది.