మంత్రుల‌తో లోకేశ్ ఆట‌లు చూస్తే అవాక్క‌వ్వాల్సిందే…

ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్ర‌బాబు త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు మంత్రి లోకేశ్ నెంబ‌ర్ 2 పొజిష‌న్‌లోకి ఎంట‌ర్ అయిపోయాడు. లోకేశ్ టీడీపీకి భ‌విష్య‌త్ సార‌థిగా ఇప్ప‌టికే అంద‌రూ అంగీక‌రిస్తుండ‌డంతో లోకేశ్ అటు పార్టీలోను, ఇటు ప్ర‌భుత్వంలోను క్ర‌మ‌క్ర‌మంగా ప‌ట్టు సంపాదిస్తున్నాడు. ఇప్ప‌టికే లోకేశ్ త‌న శాఖ‌ల్లోనే కాకుండా కొన్ని కీల‌క శాఖ‌ల‌కు సైతం అన‌ధికారిక మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న గుస‌గుస‌లు టీడీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

హోం, రెవెన్యూ లాంటి కీల‌క శాఖ‌ల్లో లోకేశ్ పెత్త‌నం కాస్త ఎక్కువ‌గానే ఉంటోంద‌న్న చ‌ర్చ‌లు ఉన్నాయి. ఇక లోకేశ్ మంత్రుల‌ను ర‌బ్బ‌రు స్టాంపులుగా భావిస్తున్నాడ‌న్న విమ‌ర్శ‌లు ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. త‌న‌కంటే రాజ‌కీయంగా ఎంతో అనుభ‌వం ఉన్న మంత్రుల ప‌ట్ల లోకేశ్ వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుతో సీనియ‌ర్ మంత్రులు తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌వుతున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న ఇన్న‌ర్ టాక్‌?

బాబు కేబినెట్‌లో కొంద‌రు మంత్రుల‌కు లోకేశ్ వ‌ద్ద జ‌రిగిన అవ‌మానాలే ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయ‌ని స‌మాచారం. రాజ‌ధాని జిల్లాకే చెందిన ఓ మంత్రి, చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడ‌ని గుర్తింపుపొందిన మ‌రో మంత్రికి జ‌రిగిన అనుభ‌వాలు.. ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. ఈ రెండు అనుభ‌వాలతో తాము నిర్ఘాంత పోయామ‌ని సీనియ‌ర్ నేత‌లు సైతం చెప్పుకొంటున్నారంటే లోకేశ్ మంత్రుల‌ను ఎలా ట్రీట్ చేస్తున్నారో అర్థ‌మ‌వుతోంది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడుకు లోకేశ్ వ‌ద్ద తీవ్ర అవ‌మానం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ఇటీవ‌ల లోకేశ్‌ను క‌లిసేందుకు వెళితే లోకేశ్ అచ్చెన్న‌ను బ‌య‌ట ఏకంగా మూడు గంట‌ల పాటు వెయిట్ చేయించాడ‌ట‌. సాధారణంగా ఓ మంత్రి.. మరో మంత్రిని కలవాలంటే మ‌హా అయితే 5-10 నిమిషాలు మాత్ర‌మే ప‌డుతుంది. కానీ లోకేశ్ కోసం అచ్చెన్న ఏకంగా మూడు గంట‌ల పాటు బ‌య‌ట కూర్చొన్నార‌ట‌.

ఇటీవ‌ల ప్ర‌క్షాళ‌న‌లో మంత్రి అయిన కేఎస్‌.జ‌వ‌హ‌ర్ కూడా గ‌తంలో లోకేశ్‌ను క‌లిసేందుకు వెళ్లి ఏకంగా గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక గుంటూరు జిల్లాకే చెందిన మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకు కూడా ఓ విష‌యంలో ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా సీనియ‌ర్లు అయిన మంత్రుల విష‌యంలో లోకేశ్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తుండడాన్ని ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు.