బీజేపీతో వైసీపీ పొత్తు…. సీట్ల డీల్ ఇదే..!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న అధికార టీడీపీ+బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌లిసుండే ఛాన్సులు లేవ‌ని ప్రచారం జ‌రుగుతోంది. కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు కూడా అందుకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు అయిన మాజీ కేంద్ర మంత్రి ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోతుండ‌డం, ఇక ఇప్పుడు ఏపీ బీజేపీ అంతా చంద్ర‌బాబును టార్గెట్ చేసే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ఏపీలో బీజేపీ టీడీపీ మ‌ధ్య ఫ్యూచ‌ర్‌లో వార్ ఓ రేంజ్‌లో ఉండడం ఖాయంగా క‌నిపిస్తోంది.

తాజాగా రాం మాధ‌వ్ అయితే పార్టీ అనేది చారిటీ కాద‌ని, గెల‌వ‌డ‌మే త‌మ ధ్యేయ‌మ‌ని చెప్పారు. ఈ లెక్క‌న చూస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో త‌మ‌కు ఎవ‌రు ఎక్కువ సీట్లు ఇస్తే ఆ పార్టీతోనే జ‌ట్టుక‌డ‌తామ‌నే సంకేతాలు బీజేపీ ఇప్ప‌టికే ఇన్‌డైరెక్టుగా పంపేసింది. టీడీపీ ఎలాగూ త‌క్కువ సీట్లే ఇస్తుంది…వైసీపీ త‌మ‌కు ఎక్కువ సీట్లు ఇస్తే అటే వెళ‌తామ‌నే సంకేతాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. టీడీపీని బ్లాక్‌మెయిల్ చేయ‌డం ద్వారా వీలున్న‌న్ని ఎక్కువ సీట్లు లాగేసుకోవ‌డం, లేనిప‌క్షంలో వైసీపీతో అయినా జ‌ట్టుక‌ట్ట‌డ‌మే బీజేపీ టార్గెట్‌గా క‌న‌ప‌డుతోంది.

ఇక బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌యసాయిరెడ్డి ఢిల్లీలో తర‌చూ బీజేపీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లో ఉంటూ వైసీపీని బీజేపీకి ద‌గ్గ‌ర చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక వైసీపీ కూడా వ్యూహాత్మ‌కంగానే ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి వెంక‌య్య‌నాయుడుకు మ‌ద్ద‌తు ఇస్తూ బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతోంది.

ఈ క్ర‌మంలోనే టీడీపీని బీజేపీకి దూరం చేసేందుకు జ‌గ‌న్ తెర‌వెన‌క చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్ని చేస్తున్నారు. బీజేపీ త‌మ‌తో పొత్తు పెట్టుకుంటే 10 ఎంపీ, 35 అసెంబ్లీ సీట్లు ఇస్తామ‌న్న బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌య‌మై విజ‌య‌సాయిరెడ్డికి రాంమాధ‌వ్ మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగిన‌ట్టు టాక్‌. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి ఏపీలో టీడీపీకి కేవ‌లం 4 ఎంపీ సీట్లు మాత్ర‌మే ఇచ్చింది. అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు కూడా.  

ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కూడా జ‌ర‌గ‌ద‌ని తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో బీజేపీకి టీడీపీతో కంటే వైసీపీతో వెళితేనే సీట్ల‌లో భారీగా ల‌బ్ధి క‌ల‌గ‌నుంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఏపీ రాజ‌కీయం ఎలాగైనా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.