నంద్యాల‌లో టీడీపీ ప్ల‌స్‌లు – వైసీపీ ప్ల‌స్‌లు ఇవే

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు రెండేళ్లు టైం ఉండ‌గా అప్పుడే ఎన్నిక‌ల ఫీవ‌ర్ స్టార్ట్ అయ్యింది. క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీకి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఈ సీటు త‌మ సిట్టింగ్ అని వైసీపీ చెపుతుంటే, టీడీపీ లెక్క మాత్రం భూమా త‌మ పార్టీలోకి రావ‌డంతో ఇది త‌మ సిట్టింగ్ సీటు అని చెపుతోంది. ఇక ఈ రెండు పార్టీల మ‌ధ్య హోరాహోరీగా జ‌రుగుతున్న పోరులో ఎవ‌రి ప్ల‌స్‌లు, మైన‌స్‌లేంటో చూద్దాం.

అధికార టీడీపీకి ప్ల‌స్‌లు ఎక్కువ‌గానే ఉన్నాయి. భూమా ఫ్యామిలీ నుంచి భార్య‌, భ‌ర్త‌లు ఇద్ద‌రూ చ‌నిపోవ‌డంతో ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచే టీడీపీ అభ్య‌ర్థిగా బ్ర‌హ్మానంద‌రెడ్డి బ‌రిలో ఉండడం ఆ పార్టీకి క‌లిసిరానుంది. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో 45 వేలు ఉన్న మైనార్టీ ఓట‌ర్లు గ‌త ఎన్నికల్లో వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉండ‌గా ఇప్పుడు వారిలో మెజార్టీ ఓట‌ర్లు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక బ‌లిజ ఓట‌ర్ల‌లో సైతం టీడీపీకే మ‌ద్ద‌తు క‌నిపిస్తోంది. ఇక ఇరు పార్టీల అభ్య‌ర్థులు రెడ్డి వ‌ర్గానికే చెందిన వారు. అయినా ఈ వ‌ర్గం ఓట‌ర్ల‌లో కూడా టీడీపీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

ఇక నంద్యాల ప‌ట్ట‌ణంలో కోట్లాది రూపాయ‌ల‌తో చేప‌డుతోన్న అభివృద్ధి ప‌నుల‌తో పాటు ఇళ్ల నిర్మాణం, భూమా ఫ్యామిలీకి బ‌లంగా ప‌ట్టున్న గోస్పాడు మండ‌లం గ‌తంలో ఆళ్ల‌గ‌డ్డ‌లో ఉండి ఇప్పుడు నంద్యాల‌లో క‌ల‌వ‌డం టీడీపీకి అనుకూలం కానున్నాయి. ఇక ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీతో పాటు బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల వ‌ల్ల ఎన్ని ఓట్లు చీలినా అవి వైసీపీ నుంచే చీల‌నున్నాయి. ఇది కూడా టీడీపీకి లాభించ‌నుంది. నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మైనార్టీ నేత‌ల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డం కూడా టీడీపీలో జోష్ నింపింది. ఇక టీడీపీకి చెందిన మంత్రులు ఇక్క‌డ మకాం వేసి ప్ర‌చారం చేస్తున్నారు.

ఇక వైసీపీ అనుకూల‌త‌ల విష‌యానికి వ‌స్తే నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పార్టీ మారి వైసీపీ నుంచి పోటీ చేయ‌డం, ఆయ‌న సోద‌రుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి సైతం వైసీపీలోకి వెళ‌తార‌న్న ఊహాగానాలు, నంద్యాల టౌన్ ఓటింగ్ ఉన్నాయి. ఇక ప్ర‌శాంత్ కిషోర్ నంద్యాల గెలుపు కోసం ప్ర‌త్యేక వ్యూహాలు ప‌న్న‌డం కూడా కలిసి రానుంది.

ఎవ‌రి అనుకూల‌త‌లు ఎలా ఉన్నా ఓవ‌రాల్‌గా విప‌క్ష వైసీపీ కంటే టీడీపీకే ఎక్కువ అనుకూల‌త‌లు ఉన్నాయి. మ‌రి ఫైన‌ల్‌గా నంద్యాల వార్‌లో ఎవ‌రు విన్ అవుతారో ? చూడాలి.