టీడీపీలో బ్ర‌ద‌ర్స్ బ‌ల ప్ర‌దర్శ‌న వెన‌క మ‌ర్మ‌మేంటో..?

క‌ర్నూలులో త‌మ హ‌వా మ‌ళ్లీ కొన‌సాగించేందుకు కేఈ సోద‌రులు త‌హ‌త‌హలాడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా పూర్వ వైభవం సంపాదించాల‌ని ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకు ఇప్ప‌టి నుంచే వ్యూహాత్మ‌కంగా పావులు క‌దప‌డం ప్రారంభించారు. త‌మ బ‌లాన్ని, బ‌ల‌గాన్ని అధినేత చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్ల‌డానికి స‌న్మాన కార్య‌క్ర‌మాన్ని వేదిక‌గా మ‌లుచుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ కుటుంబం ఎప్పుడూ టీడీపీకి విధేయ‌త‌ను ప్ర‌క‌టించింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించి చంద్ర‌బాబుకు కానుక‌గా ఇస్తామ‌ని ఆర్భాటంగా ప్ర‌క‌టించారు. ఇప్పుడు దీని వెను మ‌ర్మ‌మేమిటో అనేది క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడు, ఏపీ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ కేఈ ప్రభాకర్ సన్మాన కార్యక్రమం కర్నూలులో అట్టహాసంగా, ఆర్భాటంగా జరిగింది. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా టీడీపీ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డారు కేఈ ప్రభాకర్. ఆ సమయంలో పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై ఫైర్ అయిన బాబు క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. అనంత‌రం ప‌రిస్థితులు చ‌క్కబ‌డ్డాయి. అయితే ఇదే స‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కేఈ ప్రభాకర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం తన అభ్యర్థిత్వాన్ని పార్టీ గుర్తించేందుకే ఈ స్థాయిలో భారీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. పార్టీ అధిష్టానం కర్నూల్ లో తమ సత్తాను గుర్తించాలనే కేఈ సోదరులు ఇలా పరోక్షంగా బల ప్రదర్శన చేపట్టారని ప్రచారం జరుగుతోంది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్య‌లు కూడా ఇప్పుడు ఆస‌క్తికరంగా మారాయి, తాము మొదటి నుంచి ప్రజల సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం కేటాయించటం వల్ల ప్రజలు తమ వైపే ఉన్నారని వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలు కైవసం చేసుకుని చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తామని స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఇస్తే జిల్లాలో పార్టీకి తిరుగే ఉండదన్నారు. కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ తమ కుటుంబం మొదటి నుంచి పార్టీలో ఉందని మాపై నమ్మకం ఉంచి పదవులు కట్టబెట్టితే అందుకు ప్రతిఫలంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగుర వేయటానికి కృషి చేస్తామన్నారు. ఈ పాకులాట అంతా ప‌ద‌వుల‌కోస‌మేన‌నే సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నాయి. మ‌రి బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం ద్వారా ప‌ద‌వులు ద‌క్కించుకోవ‌చ్చా? అనే ప్ర‌శ్న‌లు కూడా వినిపిస్తున్నాయి.