గంటాను వ‌దిలించుకుంటోన్న బాబు

ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు స్టైలే వేరు. ఆయ‌నకు ఒకే పార్టీలో ఉండి రాజ‌కీయాలు చేయాల‌న్న సూత్రం ఏదీ ఉండ‌దు. ప్ర‌తి ఎన్నిక‌కు ఒక్కో పార్టీ మారే గంటా, కొత్త చొక్కా మార్చినంత సులువుగా నియోజ‌క‌వ‌ర్గాలు కూడా మార్చేస్తుంటాడు. గంటా ప‌లు పార్టీలు మారి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు త‌న టీంతో క‌లిసి టీడీపీలోకి వ‌చ్చారు. ఇక్క‌డ ఒప్పందం ప్ర‌కారం ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి గంటాకు జిల్లాలో మ‌రో మంత్రి అయ్య‌న్న‌కు అస్స‌లు ప‌డ‌డం లేదు. వీరిద్ద‌రు ప్ర‌తి చిన్న విష‌యానికి వాదులాట‌కు దిగ‌డంతో చంద్ర‌బాబుకు చాలా త‌ల‌నొప్పిగా ఉంది.

ఇక అయ్య‌న్న వ‌ర్సెస్ గంటా వార్ దెబ్బ‌తో విశాఖ జిల్లాలో పార్టీ ప‌రువు కూడా పోతోంది. చంద్ర‌బాబు వీరి మ‌ధ్య స‌యోధ్య‌కు ఎన్నోసార్లు ప్ర‌య‌త్నించినా సాధ్య‌ప‌డ‌లేదు. ఇక విశాఖ భూకుంభ‌కోణం కేసులో గంటా తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇక ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

దీంతో గంటా మ‌రోసారి వ‌చ్చే ఎన్నిక‌ల వేళ నియోజ‌క‌వ‌ర్గం మారేందుకు డిసైడ్ అయిన‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. గంటా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విశాఖ న‌గ‌రంలోని ఏదో ఒక సీటు నుంచి లేదా ప‌క్క‌నే ఉన్న విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని నెల్లిమ‌ర్ల నుంచి పోటీకి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గం మారేందుకు చంద్ర‌బాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు గంటా రెడీ అవుతున్నార‌ని టాక్. లేనిప‌క్షంలో గంటా జ‌న‌సేన‌లోకి వెళతాన‌న్న ఫ్రీల‌ర్లు కూడా వ‌దులుతున్నార‌ట‌.

అయితే చంద్ర‌బాబు మాత్రం గంటాను స్టేట్ పాలిటిక్స్‌లో లేకుండా వ‌దిలించుకునేందుకు తెలివైన వ్యూహం ప‌న్నుతున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఎమ్మెల్యే సీటు ఇవ్వ‌కుండా అన‌కాప‌ల్లి ఎంపీ సీటు కేటాయిస్తార‌ని తెలుస్తోంది. గంటా స్టేట్ పాలిటిక్స్‌లో ఉంటే గ్రూపు రాజ‌కీయాలు ఎక్కువువుతున్నాయ‌ని భావిస్తోన్న చంద్ర‌బాబు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను ఇక్క‌డ నుంచి త‌ప్పించే క్ర‌మంలో అన‌కాప‌ల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆరితేరిన గంటా ఇందుకు ఒప్పుకుంటారా ? అన్న‌ది మాత్రం కాస్త స‌స్పెన్సే.