టీడీపీకి ప‌వ‌న్ త‌ప్ప గ్లామ‌ర్ ఇంకోటి లేదా?

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌డం క‌ష్టం. అప్ప‌టి వ‌ర‌కు నా వెంటే న‌డుస్తార‌ని భావించిన నాయ‌కులు ప్ర‌జ‌లు ఎలాంటి బుద్ధి చెప్పారో అంద‌రికీ తెలిసిందే. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌న 2014లో ఏపీలో చోటు చేసుకుంది. అంద‌రూ త‌న వెంటే ఉన్నార‌ని, తానే సీఎం అని భావించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చారుఏపీ ప్ర‌జ‌లు. అస‌లు అధికారం వ‌స్తుందా? సీఎంను అవుతానా? అని సందేహాలు వ్య‌క్తం చేసిన నారా చంద్ర‌బాబుకి ప్ర‌జ‌లు ప‌ట్ట‌క‌ట్టారు. పాలిటిక్స్ అంటే ఇలానే ఉంటాయి. ఇక్క‌డ అస‌లు ఏం జ‌రిగింది. అప్ప‌ట్లో ఏం జ‌రిగితే.. సీఎం చంద్ర‌బాబు అయ్యారు. అంటే.. దీని వెనుక ఫ‌క్తు .. సినీ గ్లామ‌ర్ ఉప‌యోగ‌ప‌డింది.

2014లో తాను సొంత‌గా పార్టీ పెట్టుకున్నా ప‌వ‌న్ ఏపీలో టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసిపెట్టాడు. ఫ‌లింగతంగా టీడీపీ, బీజేపీ కూట‌మి అధికారంలోకి రాగ‌లిగింది. ఇక, ఇప్పుడు ఇదే సినీ గ్లామ‌ర్ ప‌వ‌న్ను అడ్డం పెట్టుకుని తెలంగాణ‌లోనూ ల‌బ్ధి పొందాల‌ని టీడీపీ ప్లాన్ వేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌వ‌న్‌తో పొత్తు లేదా అవ‌గాహ‌నా ఒప్పందం చేసుకోవ‌డం ద్వారా 2019లో కేసీఆర్ ప్ర‌భుత్వానికి గ‌ట్టి షాక్ ఇవ్వాల‌ని తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. తాము ఎంత‌గా మైకుల్లో చించుకున్నా ఫ‌లితం లేద‌ని, ప‌వ‌న్ వంటి ఫేమ‌స్ ఫిగ‌ర్ ఉంటేనే త‌ప్ప గెలుపు సాధ్యం కాద‌ని భావిస్తున్నాడ‌ట‌. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ను వాడుకోవ‌డంపై రేవంత్ తీవ్రంగా యోచిస్తున్నాడ‌ట‌.

ఇక‌, రేవంత్ ప‌రిస్థితి ఇలా ఉంటే.. విశ్లేష‌కులు మాత్రం రేవంత్‌ను తిట్టి పోస్తున్నారు. అతి చేస్తున్నాడ‌ని అంటున్నారు. నిజానికి సినీ గ్లామ‌ర్ కావాలంటే అది నంద‌మూరి ఇంటి క‌న్నా ఎక్కువ ఎక్క‌డా లేదు. బాల‌య్య బాబు నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్‌, తార‌క్‌, తార‌క‌ర‌త్న‌, వంటి న‌లుగురైదుగురు ఉన్నారు. వీరిని పెట్టుకుని ప్ర‌చారం చేసుకున్నా.. పాపుల‌ర్ కావొచ్చు. కానీ, రేవంత్ ఆలోచ‌న ఇలా లేకుండా ఇంకా ఎంత సేపూ ప‌వ‌న్‌ను పొలిటిక‌ల్‌గా వాడుకుందామ‌నే ఆలోచ‌నే ఉంద‌ని ఇది స‌రికాద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి రేవంత్ నిర్ణ‌యాన్ని చంద్ర‌బాబు ఎలా చూస్తారో చూడాలి!!