కేసీఆర్ కంచుకోట‌లో రాహుల్ పోటీ..!

తెలంగాణ‌లో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తుంటే అధికార టీఆర్ఎస్‌ను ఢీకొట్ట‌డం అక్క‌డి రాజ‌కీయ ప‌క్షాల వ‌ల్ల అయ్యేలా లేదు. బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, వైసీపీ చేతులెత్తేయ‌గా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ ముగ్గురు నాయ‌కులు, ఆరు గ్రూపుల‌తో విల‌విల్లాడుతోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితి కంటిన్యూ అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా అయినా ద‌క్కుతుందా ? అన్న సందేహాలే అంద‌రికి క‌లుగుతున్నాయి.

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు సూప‌ర్ బూస్ట‌ప్ ఇచ్చే వార్త ఒక‌టి వినిపిస్తోంది. రాహుల్‌గాంధీ కేసీఆర్ కంచుకోట‌గా ఉన్న మెద‌క్ లోక్‌స‌భ సీటు నుంచి పోటీ చేసేలా టీ కాంగ్రెస్ నాయ‌కులు ఒప్పించే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో ఇదే సీటు నుంచి రాహుల్ నాయ‌న‌మ్మ‌, మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ పోటీ చేసి జైపాల్‌రెడ్డిపై ఏకంగా 2.19 ల‌క్ష‌ల ఓట్ల భారీ తేడాతో గెలిచారు. త‌ర్వాత కాంగ్రెస్ సీనియ‌ర్ నేత బాగారెడ్డి కూడా ఇక్క‌డ నాలుగుసార్లు గెలిచారు.

కాంగ్రెస్‌కు మెద‌క్ లోక్‌సభ సీటు కంచుకోట‌. అదంతా గ‌తం. కాంగ్రెస్ ఈ సీటును చివ‌రిగా 1998లో మాత్ర‌మే గెలుచుకుంది. అప్పుడు బాగా రెడ్డి గెలిచారు. ఆ త‌ర్వాత బీజేపీ, టీఆర్ఎస్‌లు గెలుస్తూ వ‌స్తున్నాయి. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి కేసీఆర్ దాదాపు 4 ల‌క్ష‌ల ఓట్ల‌తో గెల‌వ‌గా, ఆ త‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోను ప్ర‌స్తుత ఎంపీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి 3.6 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

ఇక ఇప్పుడు టీఆర్ఎస్‌కు కంచుకోట‌గా ఉన్న మెద‌క్ సీటు నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తే ఆ ప్ర‌భావం ఈ లోక్‌స‌భ సీటుతో పాటు మొత్తం తెలంగాణ మీదే ఉంటుంద‌ని టీ కాంగ్రెస్ వ‌ర్గాలు లెక్కలు వేస్తున్నాయి. టీ కాంగ్రెస్ లెక్క‌లు ఎలా ఉన్నా, రాహుల్ ఇక్క‌డ పోటీ చేయాలంటే ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో ముందుగా స‌ర్వే చేసుకున్నాకే ఆయ‌న డెసిష‌న్ ఉంటుంది.

ఇక ప్ర‌స్తుతం టీఆర్ఎస్ ఇక్క‌డ బ‌లంగా ఉండ‌డంతో ఇక్క‌డ ఆ పార్టీని ఓడించ‌డం అంత సులువుకాద‌ని కూడా రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఒక వేళ ఇక్క‌డ నిజంగానే రాహుల్ బ‌రిలో ఉంటే ఆ ఎఫెక్ట్ తెలంగాణ అంత‌టా ఉండ‌డం ఖాయం. అప్పుడు టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ మ‌ధ్య వార్ వ‌న్‌సైడ్ కాకుండా కాస్త ర‌స‌వ్త‌త‌ర పోటీ జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.