పీకే స‌ర్వే ప‌క్క‌దారి ప‌డుతోందా?  జ‌గ‌న్‌కు నిజాలు తెలిసే అవ‌కాశం లేదా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల‌పై భారీ అంచ‌నాలు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. 2019 ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం సీటును అధిరోహించి క‌నీసం 30 ఏళ్ల‌కు త‌గ్గ‌కుండా రాష్ట్రాన్ని పాలించాల‌ని త‌న‌కు ఉంద‌ని ఆయ‌న మొన్నామ‌ధ్య విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ప్లీన‌రీ సంద‌ర్భంగా భారీ ఎత్తున ప్ర‌క‌టించాడు కూడా. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజ‌కీయంగా త‌న‌కు ఎంత చాతుర్యం ఉన్నా.. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఆవ‌గింజంత అయిడియా కావాల‌ని భావించి.. ఖ‌రీదు ఎక్కువైనా ఎన్నిక‌ల వ్యూహ క‌ర్త‌గా పేరు పొందిన బిహార్‌కు చెందిన ఐఐటీయెన్ ప్ర‌శాంత్ కిశోర్‌ని త‌న‌కు ఎన్నిక‌ల స‌ల‌హాదారు నియ‌మించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఎవ‌రి మాటా విన‌ని నేత‌గా పేరు తెచ్చుకున్న జ‌గ‌న్‌.. గ‌త కొన్ని వారాలుగా మాత్రం ప్ర‌శాంత్ కిశోర్ చెప్పిన‌ట్టే చేస్తున్నాడు. ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే త‌న మ్యానిఫెస్టోను ప్ర‌క‌టించి.. అధికార ప‌క్షాన్ని డిఫెన్స్‌లో ప‌డేశాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు ప్ర‌శాంత్ కిశోర్ చేస్తున్న ఓ ప‌ని మాత్రం విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. 2019 నాటికి జ‌గ‌న్ గెలిచేందుకు ఏ మేర‌కు వాతావ‌ర‌ణం స‌హ‌క‌రిస్తుంది? ఎంత‌మంది ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు అనుకూలంగా ఉన్నారు? ఎంత మంది ఆయ‌న‌ను సీఎంగా చూడాల‌ని భావిస్తున్నారు? వ‌ంటి అనేక విష‌యాల‌పై ప్ర‌శాంత్ ఓ స‌ర్వే చేయిస్తున్నారు.

దీనికిగాను కొన్ని బృందాల‌ను ఎంపిక చేసి.. జిల్లా, న‌గ‌ర‌, మండ‌ల, గ్రామ స్థాయికి పంపారు. వీరు తెచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగానే జ‌గ‌న్ భ‌విష్య‌త్తును నిర్ణ‌యించాల‌ని ప్ర‌శాంత్ కిషోర్ భావించారు. అయితే, ఇప్పుడు ఈ బృందాల నిర్వాకంపైనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బృందాలు నేరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లి పార్టీపైనా, జ‌గ‌న్‌పై అభిప్రాయాలు తెలుసుకోవాల్సిన వీరు వెళ్లీ వెళ్ల‌గానే స్థానికంగా ఉన్న వైసీపీ నేత‌ల ఇళ్ల‌లో తిష్ట వేస్తున్నారు. వాళ్లు పెట్టిన‌వి తింటూ.. వాళ్లు ఇచ్చినవి తాగుతూ.. చివ‌రికి వారు చెప్పిన స‌మాచారాన్నే న‌మోదు చేసుకుని వ‌స్తున్న‌ట్టు స‌మాచారం.

దీంతో ఈ స‌ర్వే ప‌క్క‌దారి ప‌ట్టే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి స‌మాచారం సేక‌రిస్తే.. వాస్త‌వాలు తెలుస్తాయ‌ని, అలాకాకుండా వైసీపీ నేత‌లు, ఎమ్మెల్యేల ఇళ్ల‌లో మ‌కాం వేసి ఆ నేత‌ల నుంచే స‌మాచారం సేక‌రిస్తే.. వాళ్లు చెప్పేది అంతా పాజిటివ్ గానే ఉంటుంద‌ని నెగిటివ్ విషయాలు ఎలా తెలుస్తాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఈ స‌ర్వే బృందాల ప‌నితీరు మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ విధంగానే స‌ర్వే సాగి.. ఇవే విష‌యాల‌తో రిజ‌ల్ట్ ఇస్తే.. జ‌గ‌న్‌కి ఇబ్బందేన‌ని విశ్లేష‌కుల మాట‌. మ‌రి ప్ర‌శాంత్ ఎలా ముందుకు వెళ్తాడో చూడాలి.