ప్ర‌శాంత్ ప్ర‌భావం జ‌గ‌న్‌పై ప‌డిందిగా..

`నువ్వు మారాలి.. నీ వ్య‌వ‌హార శైలి మారాలి.. నీ మాట తీరు మారాలి` అంటూ పార్టీలో సీనియ‌ర్ నేత‌లు ఎంత‌మంది చెప్పినా ప‌ట్టించుకునే వారు కాదు వైసీపీ అధినేత,ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌!! నిన్న‌మొన్న‌టి వ‌రకూ టీడీపీ నేత‌లు కూడా ఆయ‌న వ్య‌వ‌హార‌శైలినే టార్గెట్ చేసేవారు!! ఇప్పుడు జ‌గ‌న్ నిజంగానే మారిపోయారు. ఇటీవ‌ల ఆయ‌న పాల్గొన్న సంఘ‌ట‌న‌లు, ఆయ‌న మాట‌తీరు గ‌మ‌నించి వారంతా ఇప్పుడు ఆశ్చర్య‌పోతున్నారు. దీని వెనుక ఏరికోరి తెచ్చుకున్న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌భావం చాలానే ప‌డింద‌ని గుస‌గులాడుతున్నారు. జ‌గ‌న్‌లో ఈ మార్పుకు ఆయనే కార‌ణ‌మ‌ని.. ఇలా అయితే జ‌గ‌న్‌లో మ‌రింత మార్పు ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు స్ప‌ష్టంచేస్తున్నారు.

ఇటీవల నిర్వ‌హించిన స‌మావేశాల్లో జ‌గ‌న్ మాట్లాడుతున్న తీరు, ఆయ‌న వ్య‌వ‌హార శైలి గురించి ఇప్పుడు విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. సహజంగా జగన్ తన పాత పద్దతిలో ఉంటే గరగపర్రుకు వెళ్లి సీఎం చంద్ర‌బాబుపై ఆయనపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోయాలి. రాజకీయ లక్ష్యంతోనే పర్యటన సాగాలి. కానీ ఆయన పర్యటన పూర్తి భిన్నంగా సాగింది. రాజ‌కీయ విమ‌ర్శ‌లు లేవు. కులాల‌కు సంబంధించిన ఆరోప‌ణ‌లు అస్స‌లు లేవు. `అంతా ఐక్యంగా ఉందాం.. సామ‌రస్యంగా ముందుకు సాగుదాం` అంటూ శాంతి వ‌చ‌నాలు చేశారు. గ‌ర‌గ‌ప‌ర్రులో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు చూసిన విశ్లేష‌కులు ఒకింత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.

ఈ షాక్ నుంచి తేరుకుంటున్న స‌మ‌యంలోనే.. జ‌గ‌న్ మ‌ళ్లీ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాద్ కోవింద్ కు జగన్ పాదాభివందనం చేయటం పెద్ద సంచలనంగా మారింది. ఉత్తరాదిలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇది సహజమే అయినా.. తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా అరుదే. ఇది చూసిన వారంతా జ‌గ‌నేంటి.. ఇలా పాదాభివంద‌నం చేయ‌డ‌మేంట‌ని నివ్వెర‌పోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తోపాటు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు పలుమార్లు పాదాభివందనాలు చేశారు. దీనిపైనా కొంద‌రు విమ‌ర్శ‌లు చేశారు.

ఇఫ్పటివరకూ జగన్ బహిరంగంగా ఎవరికీ పాదాభివందనం చేసింది లేదు. ఇప్పుడు కాబోయే రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్ కు పాదాభివందనం చేయటం రాజకీయంగా ఆయనకు బాగా ప్లస్ అవుతుంద‌నే వాదన వినిపిస్తోంది. దీనిపై ఇంత‌వ‌ర‌కూ జగన్ ను ఎవ‌రూ విమర్శించలేదు. అదే సమయంలో ఇప్పటికే జగన్ వైపు ఉన్న పలు పక్షాలు మరింత ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశాలున్నాయ‌ట‌. రాజకీయ వ్యూహాలు రచించటంలో దిట్ట అయిన ప్రశాంత్ కిషోర్ ప్రభావంతోనే ఇదంతా జరుగుతుందనే ప్రచారం కూడా ఉంది. మ‌రి జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిలో మ‌రిన్ని మార్పులు దేనికి సంకేతాలిస్తాయో!!