చంద్ర‌బాబుకు ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు `రిజ‌ర్వేష‌న్ల` అంశంలో త‌ల‌నొప్పులు త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న చందంగా ప‌రిస్థితి ఉండటంతో ఏం చేయాలో తెలియ‌క సందిగ్థంలో ఉన్నారు. ఇప్ప‌టికే కాపు రిజర్వేష‌న్ల అంశంపై ఆందోళ‌న‌లు జరుగుతున్నా.. దానిని ఎలాగొలా అణిచివేస్తున్న చంద్ర‌బాబుకు.. ఇప్పుడు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. మాల‌ల‌ను ద‌గ్గ‌ర చేసుకుంటే మాదిగ‌లు దూర‌మైపోతారు.. అదే స‌మ‌యంలో మాదిగ‌ల‌ను దూరం చేసుకుంటే వాళ్లంతా ఇత‌ర పార్టీల చెంత‌న చేరే ప్ర‌మాద ముంది. గ‌తంలో బాబు చేసిన త‌ప్పులే ఈ ప‌రిస్థితికి కార‌ణ‌మ‌ని పార్టీలోని కొన్ని వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి.

ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌ చేస్తూ మందకృష్ణ మాదిగ తలపెట్టిన `మాదిగల కురుక్షేత్ర మహాసభ` టీడీపీ నేతల్లో చీలిక‌కు కార‌ణ‌మవుతోంది. ఈ సభకు రాష్ట్ర హైకోర్టు అనుమతివ్వడంతో మాదిగ ఎమ్మెల్యేలు కొంత ఇబ్బంది ప‌డాల్సి ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో మంత్రి జవహర్‌ నేతృత్వంలో వీరంతా సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. అయితే ఎమ్మెల్యేల్లో మాత్రం అంత‌ర్గ‌తంగా టీడీపీ అధినేత వైఖరిపై కాస్త అసంతృప్తి ఉంద‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. ఎస్సీ వర్గీకరణను సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత రిజర్వేషన్లను అమలు చేస్తామని చాలా సందర్భాలలో చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత లెక్కలు పూర్తిగా మారిపోయాయి.

2014 ఎన్నికల్లో వైసీపీ గణనీయంగా స్థానాలను దక్కించుకోవడానికి ఎస్సీ ఓటర్లే కీలక పాత్ర పోషించారని గుర్తించిన చంద్రబాబు మాలలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జూపూడి., ఎస్సీ కమిషన్‌కు కారెం శివాజీని ఛైర్మన్‌లుగా నియమించారు. పోలీస్ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు వర్ల రామయ్యను నియమించడం., పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను టీడీపీలో చేర్చుకోవడం.. ద్వారా మాల సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. ఇది మందకృష్ణకు ఆగ్రహం కలిగించింది. దీంతో మూడేళ్లుగా చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆరేడు నెలలుగా కురుక్షేత్ర మహాసభ పేరుతో బలప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

వీటిని కూడా అడ్డుకునేందు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. ఏపీలో మందకృష్ణ పర్యటించకుండా పోలీసులు అప్రకటిత నిషేధం విధించారు. ప్ర‌స్తుతం స‌భ‌కు హైకోర్టు అనుమతివ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందని మాదిగ సామాజిక‌వ‌ర్గ ఎమ్మెల్యేలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గతంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వర్గీకరణకు మద్దతిచ్చామని., ఇప్పుడు నిర్ణయం కేంద్రం పరిధిలో ఉందని బాబు చెబుతున్నారు. చంద్రబాబు గ‌తంలో చేసిన ప్ర‌క‌ట‌న‌.. ఇప్పుడు ఆయ‌న‌కే తీవ్ర ఇబ్బందులు క‌లిగిస్తోంది.