నంద్యాల‌లో పొలిటిక‌ల్ హీట్ ఎలా ఉంది..!

ఇంకా ఇప్ప‌టికీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నుంచి ఎలాంటి ఉప ఎన్నిక ప్ర‌క‌ట‌నా రాన‌ప్ప‌టికీ.. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో మాత్రం ఉప ఎన్నిక వేడి పీక్ స్టేజ్‌లో కొన‌సాగుతోంది. ఇక్క‌డి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించిన భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఈ పోస్టు ఖాళీ అయిన విష‌యం తెలిసిందే. అయితే, దీనిని తామంటే తామే గెలిచి తీరాల‌ని అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు గ‌ట్టి ప‌ట్టుమీద ఉన్నాయి. 2014లో ప్ర‌జ‌లు త‌మ అభ్య‌ర్థి భూమాకే ప‌ట్టం క‌ట్టార‌ని వైసీపీ అంటోంది.

ఇక‌, ఇవ‌న్నీ వేస్ట్ అనీ, త‌మ పార్టీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న భూమా మ‌ర‌ణించిన స్థానం త‌మ‌దేన‌ని టీడీపీ అంటోంది. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. అధికార టీ డీపీ ఇప్ప‌టికే మంత్రులు , అధికారుల‌ను రంగంలోకి దింపింది. మంత్రి నారాయ‌ణ సాక్షాత్తూ.. వీధివీధిలోనూ తిరుగుతూ రోడ్లు, గుంత‌లు, కాలువ‌లు ప‌రిశీలించారు. కాలువ‌లు ద‌గ్గ‌రుండి పూడిక తీయించారు. ఇక‌, ద‌శాబ్దాల డిమాండ్‌గా ఉన్న నంద్యాల ప్ర‌ధాన ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నులను ఆఘ‌మేఘాల‌పైన నిన్న ప్రారంభించేశారు.

సీఎం చంద్ర‌బాబు నేరుగా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్నేస్తున్నారు. ఏం జ‌రిగినా త‌న‌కు తెలియాల‌ని, అభివృద్ధిని చూపించి ఓట్లు రాబ‌ట్టాల‌ని ఇప్ప‌టికే నేత‌ల‌కు స్ప‌ష్టం చేశారు. పూర్తి బాధ్య‌త‌ను మంత్రుల‌కే అప్ప‌గించారు. మంత్రి భూమా అఖిలప్రియ కూడా ఈ స్థానం నుంచి టీడీపీ తరుపున పోటీ చేస్తున్న తన సోదరుడు బ్రహ్మనందరెడ్డిని గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. మ‌రోప‌క్క‌, ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ కూడా ఇక్క‌డి గెలుపుకోసం అనేక విధాల ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే 2019 కోసం రెడీ అయిన మ్యానిఫెస్టోలోని అనేక అంశాల‌ను ఇప్పుడే ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాని జ‌గ‌న్ డిసైడైన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

కీలక నేతలందరూ నియోజకవర్గంలోనే ఉండేలా జగన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. గుంటూరు ప్లీనరీలో పార్టీ ప్రకటించిన తొమ్మిది హామీలను నంద్యాల ప్రజలల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని వైసీపీకి అనుకూలంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా నంద్యాలలో గెలుపుకు బాట వేయాలని భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు విడుతలైన తర్వాత నంద్యాలలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశలు ఉన్నాయి.