టీడీపీలో ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్ల‌డం.. టీడీపీకి క‌లిసొచ్చిందా? ఇప్ప‌టికే ఇద్ద‌రు కేంద్ర మంత్రులు ఉన్న ఈ పార్టీకి ముచ్చ‌ట‌గా మూడో ప‌ద‌వి అంటే వెంక‌య్య ప్లేస్ కూడా ద‌క్క‌బోతోందా? అంటే ఔన‌నే స‌మ‌ధానామే వ‌స్తోంది టీడీపీ శ్రేణుల నుంచి. వివ‌రాల్లోకి వెళ్తే.. కేంద్రంలో అధికార‌ప‌క్షానికి మిత్రప‌క్షంగా ఉన్న టీడీపీ రెండు మంత్రి ప‌ద‌వుల‌ను కొట్టేసింది. ఇక‌, ఇప్పుడు తాజాగా ఏపీకి చెందిన కేంద్ర మంత్రి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

దీంతో త్వ‌ర‌లోనే వెంక‌య్య ప్లేస్‌లో ఎవ‌రినో ఒక‌రిని మోడీ నియ‌మించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ క్ర‌మంలో ఈ ప‌ద‌విపై మిత్ర ప‌క్షంగా ఉన్న టీడీపీ క‌న్నేసింది. ముఖ్యంగా టీడీపీ సీనియ‌ర్ నేత‌లు గా ఉన్న మ‌చిలీప‌ట్నం ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌రావు, రాయ‌పాటి సాంబ‌శివ‌రావులు కేంద్రంలో ప‌ద‌వి ద‌క్కించుకునేందుకు య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వెంక‌య్య ప‌ద‌వి టీడీపీకే కేటాయిస్తే.. వీరిద్ద‌రే గ‌ట్టి పోటీకి దిగే సూచ‌న‌లు కూడా ఉన్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

ఇదిలావుంటే, సీఎం చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు కడపకి చెందిన సీనియ‌ర్ నేత, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ కూడా మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న కూడా చంద్ర‌బాబుపై ఒత్తిడి పెంచుతున్నార‌ని తెలుస్తోంది. నిజానికి కేంద్ర మంత్రివర్గాన్ని ఎప్పుడో విస్తరించాల్సింది. కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గత ఏప్రిల్ లో ఆ పదవికి రాజీనామా చేసి గోవా ముఖ్య మంత్రిగా వెళ్లారు. అప్పటి నుంచి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీయే రక్షణ శాఖను కూడా అదనంగా నిర్వహి స్తున్నారు.

ఆర్ధికమంత్రిగా సంస్కరణల పురోగతి మీద ఎక్కువగా దృష్టి సారించాల్సి రావడం..పెద్ద నోట్ల రద్దుతో వచ్చిన ఇబ్బందుల్ని అధిగమించే కసరత్తులో బిజీగా ఉండటం..కొత్తగా జీఎస్టీ పన్ను వ్యవస్ధను దేశవ్యాప్తంగా అమల్లోకి తేవడం.ఇలా అనేక కారణాల వల్ల ఆర్ధికమంత్రి మీద పని ఒత్తిడి పెంచతగదని ప్రధాని మోడీ భావిస్తున్నట్టు చెబుతున్నారు.

మరోవైపు సరిహద్దుల్లో నిత్యం కలహాలు రేగుతుండడంతో రక్ణణ శాఖకు ప్రత్యేకంగా ఓ మంత్రి అవసరం. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంక‌య్య‌ను రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌విలోకి పంపుతుండ‌డంతో ఈ ప‌ద‌వికి కూడా ఎంపిక త‌ప్ప‌నిస‌రి అయింది. దీంతో త్వ‌ర‌లోనే మోడీ త‌న టీంలోకి కొత్త ర‌క్తాన్ని ఎక్కిస్తార‌నే ప్ర‌చారం ఢిల్లీ లో పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు టీడీపీ ఎంపీలు ఎవ‌రికివారే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసార‌ని స‌మాచారం. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి. చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న‌కు ఢిల్లీ బీజేపీ అధినాయ‌క‌త్వం స‌మ్మ‌తిస్తుందా? లేదా ? అన్న‌దీ ప్ర‌ధాన ప్ర‌శ్నే!!