జ‌న‌సేన‌లో క‌న్నాకు ప్ర‌త్య‌ర్థి రెడీ..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌కొద్దీ ఏపీ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి! విభ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు అత్యంత కీల‌కంగా మారిన గుంటూరులో ఆస‌క్తిక‌ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని పవ‌న్ క‌ల్యాణ్ ప్ర‌భావం ఎన్నిక‌ల్లో ఎలా ఉంటుందో తెలియ‌దుగానీ.. ప్రస్తుతం మాత్రం రాజ‌కీయ పార్టీల నేత‌లకు మాత్రం క‌ల్ప‌త‌రువుగా మార‌బోతోంది. ఇప్ప‌టికే ఆ పార్టీలో చేరేందుకు టీడీపీ, బీజేపీ, వైసీపీ నాయ‌కులు వేచిచూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో గుంటూరు రాజ‌కీయాల్లో ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్త తుల‌సీ సీడ్స్ అధినేత తుల‌సీ రామ‌చంద్ర ప్ర‌భు జ‌న‌సేన‌తో జ‌త‌క‌ట్ట‌డం చర్చ‌నీయాంశ‌మైంది.

గుంటూరు రాజకీయాల్లో రెండు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నేత‌లుగా రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఉన్నారు. ప్ర‌స్తుతం క‌న్నా.. బీజేపీలో చేరినా అక్క‌డ స‌రిగ్గా ఇమ‌డ‌లేక‌పోతున్నార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇదే స‌మయంలో తుల‌సీరామ‌చంద్ర జ‌న‌సేన‌లో చేర‌తార‌న్న వార్త‌లు ఇప్పుడు క‌న్నాకు మింగుడుప‌డ‌టం లేదు. అదేంటి అనే ఆశ్చ‌ర్యం క‌ల‌గమాన‌దు. దీని వెనుక అనేక ప‌రిణామ‌లు ఉన్నాయి. అదేంటంటే.. 2009 ఎన్నికల్లో కన్నా కాంగ్రెస్ అభ్యర్థిగా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు టీడీపీ నుంచి చుక్కపల్లి రమేష్, పీఆర్ఫీ నుంచి తులసి రామచంద్ర ప్రభు బరిలో నిలిచారు.

పెదకూరపాడు నియోజకవర్గంలో వరస విజయాలు సాధించిన కన్నాకు ఈ ఎన్నికలు చుక్కలు చూపించాయి. ప్రత్యర్థులిద్దరూ వ్యాపారవేత్తలు కావడం, తుల‌సీ రామ చంద్ర ప్రభు.. కాపు ఓటు బ్యాంకు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఖర్చు చేయడంతో.. కేవలం 3 వేల పై చిలుకు మెజారిటీ తో చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన చందంగా ఆ ఎన్నికల్లో బయటపడ్డారు. ఒకప్పుడు తనకి దగ్గరగా వ్యవహరించిన ప్రభు.. త‌న‌పైనే పోటీచేయ‌డంతో బాగా క‌న్నా నొచ్చుకున్నా రట! అందుకే ఎన్నికలు అయ్యాక తులసి సీడ్స్ కి సంబంధించిన కొన్ని లొసుగుల్ని ఆసరా చేసుకుని చుక్కలు చూపించారు. ఈ ఇబ్బందుల నుంచి అతి కష్టం మీద బయటపడ్డ తులసి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.

2014 ఎన్నికల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీచేసేందుకు ప్ర‌య‌త్నించినా.. టికెట్ దొర‌క‌లేదు. కన్నా నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న తులసి రామచంద్ర ప్రభు.. ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీపై తీవ్ర‌స్థాయిలో ఫైర్ అవుతోన్న జ‌న‌సేన‌లో చేరేందుకు ఆయ‌న రెడీగా ఉన్నార‌ట‌. ప్రభు కుమారుడు ధర్మ చరణ్ ని కన్నా మీద పోటీ చేయించాలని భావిస్తున్నారట‌. మ‌రి ఇదే జ‌రిగితే క‌న్నాకు నిజంగా షాక్ త‌గిలిన‌ట్టే. ఒక వేళ క‌న్నా వైసీపీలో చేరి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసినా అలాగైనా జ‌న‌సేన నుంచి ధ‌ర్మ‌చ‌ర‌ణ్ బ‌రిలో ఉండ‌డం ఖాయం.