టార్గెట్ జ‌గ‌న్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ను, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని విడదీసి చూడ‌లేం! అంత‌లా కాంగ్రెస్‌ను త‌న‌లో ఐక్యం చేసేసుకున్నాయాన‌! ఆయ‌న మ‌ర‌ణం తర్వాత వైఎస్ జ‌గ‌న్ రాష్ట్ర రాజ‌కీయాల్లోకి రావ‌డం.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా జ‌గ‌న్ వైపు వెళ్లిపోవ‌డం.. ఇదే స‌మయంలో విభ‌జ‌న జ‌ర‌గ‌డం.. ఇలా దెబ్బ మీద దెబ్బ త‌గ‌లడంతో ఏపీలో కాంగ్రెస్ జాడే లేకుండా పోయింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి కొంతైనా పుంజుకోవాల‌ని పార్టీ త‌హ‌త‌హ‌లాడుతోంది. ఇదే స‌మ‌యంలో వైఎస్ పేరు చెప్పి.. త‌మ ఓటు బ్యాంకుపై దెబ్బ‌కొట్టిన జ‌గ‌న్‌పై దాడికి సిద్ధ‌మైంది. దీంట్లో భాగంగా.. వైఎస్ ను త‌మ వాడిగా చెప్పుకుంటూ.. జ‌గ‌న్‌ను వేరుచేసే ప్లాన్ వేసింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీలో క‌దిల‌క మొద‌లైంది! `ఆపరేష‌న్ జ‌గ‌న్‌` ప్రారంభించింది. గ‌త‌ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓట్ల‌న్నీ వైకాపాకి త‌ర‌లిపోయాయ‌నీ.. ఆ ఓటు బ్యాంకును వెన‌క్కి ర‌ప్పించుకుంటే కొంత ప్ర‌భావం ఉంటుంద‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా అధికార టీడీపీని కంటే ప్ర‌తిప‌క్ష పార్టీ జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకుని కార్యాచ‌ర‌ణ‌కు దిగాల‌ని చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం! కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ బ‌ట్టే ఆంధ్రాలో వైయ‌స్ ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశపెట్ట గలిగార‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించింది. వైయ‌స్ హ‌యాంలో సాధించిన విజ‌యాల‌ను కాంగ్రెస్ పార్టీకి ప్ల‌స్ అయ్యేలా మ‌లుచుకోవాలే గానీ, వాటిపై జ‌గ‌న్ కు మైలేజ్ ఇవ్వ‌కూడ‌ద‌నేది వ్యూహం!

అందుకు అనుగుణంగా ఇప్పుడు ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా బ‌హిరంగ లేఖ రాశారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో భాజ‌పాకి ఎలా మ‌ద్ద‌తు ఇస్తారని జ‌గ‌న్ ను ర‌ఘువీరా ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా ద్రోహం చేసి, ప్ర‌త్యేక హోదా విష‌యంలో కూడా మోసం చేసిన భాజ‌పాకి వైకాపా మ‌ద్ద‌తు ఏంటంటూ ప్ర‌శ్నించారు. ఇక‌, దివంగ‌త వైయ‌స్ సిద్ధాంతాల‌కు వ్య‌తిరేకంగా జ‌గ‌న్ ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ర‌ఘువీరా దుయ్య‌బ‌ట్టారు. జ‌గ‌న్‌ రాజ‌కీయ అవ‌కాశవాదిగా మారిపోయార‌ని తీవ్రంగా విమ‌ర్శించారు. వైయ‌స్ వేరు, జ‌గ‌న్ రాజ‌కీయం వేరు అనే కాన్సెప్ట్ ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే వ్యూహంలో ఈ బ‌హిరంగ లేఖ తొలి అస్త్రమ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.