టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తు?

తెలంగాణ‌లో `టీడీపీ-టీఆర్ఎస్ దోస్తానా` అంటూ కొన్ని రోజుల క్రితం వ‌చ్చిన వార్త‌లు తెలంగాణ రాజకీయాల్లో క‌ల‌క‌లం సృష్టించాయి. త‌ర్వాత ఇది సాధ్య‌ప‌డేదే కాదంటూ కొంద‌రు దీనిని కొట్టిపాడేశారు. అయితే ఇప్పుడు ఏకంగా ఇరు రాష్ట్రాల సీఎంల మ‌ధ్యే ఈ చ‌ర్చ రావ‌డంతో ఎప్పుడు ప‌రిస్థితులు ఎలా మార‌తాయోన‌ని విశ్లేష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక‌వేళ ఇదే జ‌రిగితే.. ఫైర్ బ్రాండ్‌ రేవంత్ రెడ్డి సంగ‌తేంటి? అనే సందేహాలు వ్య‌క్తంచేస్తున్నారు. కేసీఆర్‌-రేవంత్ ఒకే ఒర‌లో ఇమ‌డని రెండు క‌త్తులన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే! మ‌రి ఇలాంటి స‌మ‌యంలో రేవంత్ ఒంట‌రి అయిపోతాడా? అనే ప్ర‌శ్న‌లు వేస్తున్నారు!!

ఏపీ, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పెంపు కోసం కలసి పనిచేయాలని రెండు తెలుగు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు అంగీకారానికి వచ్చారని పతాక శీర్షికలొచ్చాయి. దీని త‌ర్వాత టీ టీడీపీ నేతలు చంద్రబాబుతో సమావేశమ‌య్యారు. అప్పుడు కేసీఆర్‌తో జరిపిన చర్చల గురించి ప్రస్తావించారు. అప్పుడు ఆయన మాట్ల‌డుతూ.. సరదాగా ఏదో అన్నారని క‌థనం. అయితే ఇదే ఊపులో ఆయన మరికొన్ని సంకేతాలు ఇచ్చారట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీకి టీఆర్‌ఎస్‌ కొన్ని స్థానాలు కేటాయించే అవకాశముందన్న అభిప్రాయం కలిగించారట. ఇదెలా సాధ్య‌మ‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేకదా అంటున్నారు టీ టీడీపీ నేత‌లు!

అయితే ఇప్పుడు కొత్త చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై నిప్పులు కక్కడం ఆయన సొంత‌ వ్యవహారమే గాని.. అది పూర్తిగా తమ పార్టీ విధానం కాదని కూడా నేత‌లు వివ‌రిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌తో కలిపి పోటీ చేయడంపై చేసిన వ్యాఖ్యలు కూడా చంద్రబాబుకు రుచించలేదట. అయితే ఈ విషయమై మరీ తీవ్రంగా ఖండించగల మందలించగల స్థితిలో ఆయన లేరన్నది పార్టీ వర్గాల అంచనా. రేవంత్ ఒక టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దీనిపై సూటిగానే మాట్లాడారు. 1996లో మా పార్టీ నేతలు కాంగ్రెస్‌పై ఆధారపడిన మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నారని గుర్తు చేశారు.

ఒక వరలో రెండుకత్తులు ఇమడవంటూ తాను కేసీఆర్‌ ఒకే పొత్తులో ఉండబోమని స్ప‌ష్టంచేశారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజల సంఖ్య గణనీయంగా ఉంటుంది టుంది గనక రెండు రాష్ట్రాల సఖ్యత నెపంతో ఈ రాజకీయ అవగాహనతో ముందుకు వెళ్ల‌వ‌చ్చ‌నే దానిని కూడా కాద‌న‌లేం. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎలా ముగుస్తుందో!!