టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం చాలా హాట్‌హాట్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో ఫైరైయ్యారు. సొంత పార్టీ నేత‌ల‌పైనే ఆయ‌న త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సోమ‌వారం జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో కొందరు మంత్రులపై చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల బాబు ప‌నితీరుపై జాతీయ స్థాయి సంస్థ చేసిన స‌ర్వేలో 47 శాతం మంది సంతృప్తిగా ఉన్న‌ట్టు ఫ‌లితాలు వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే. దీనిపై బాబు మాట్లాడుతూ ప్ర‌భుత్వ ప‌నితీరుపై సంతృప్తి శాతాన్ని 47 శాతం నుంచి ఇంకా పెంచాల‌ని ఆయ‌న మంత్రుల‌కు సూచించారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌నితీరు స‌రిగా లేని ఎమ్మెల్యేల‌కు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌కు టిక్కెట్లు ఇచ్చేది లేద‌ని ఆయ‌న ఖ‌రాఖండీగా చెప్పేశార‌ట‌.

ఇక నంద్యాల ఉప ఎన్నిక దృష్ట్యా ఆయ‌న జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసుల‌తో పాటు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణ‌మూర్తి, మునిసిప‌ల్ శాఖా మంత్రి నారాయ‌ణ‌ను ప‌దే ప‌దే వివ‌ర‌ణ కోరార‌ట‌. అక్క‌డ ప‌రిస్థితుల‌పై చంద్ర‌బాబు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వీరు ముగ్గురు నీళ్లు న‌మ‌ల‌డంతో బాబు సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక బాధ్య‌త మొత్తం మంత్రి అఖిల‌ప్రియ మీదే వ‌దిలేయ‌కుండా మీరంతా బాధ్య‌త తీసుకోవాల‌ని చంద్ర‌బాబు వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చార‌ట‌. ఇక నంద్యాల మునిసిపాలిటీని టీడీపీ ప‌రం చేయాల‌ని సూచించినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై కూడా బాబు మంత్రుల‌పై ఫైర‌య్యార‌ని స‌మాచారం.

ఇక ఇటీవ‌ల ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసి వేటుకు గురైన ఏపీ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ మాజీ మంత్రి ఐవైఆర్.కృష్ణారావు విష‌యంలో మంత్రులు సీరియ‌స్‌గా ఎందుకు మాట్లాడ‌లేక‌పోయార‌ని మంత్రుల‌పై బాబు ఘాటుగా స్పందించార‌ని స‌మాచారం. ఇక గుంటూరు జిల్లా మంత్రుల‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలంద‌రిని బాబు ఏకిప‌డేశార‌ట‌. ఇటీవ‌ల జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు జిల్లా సమావేశం పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కాకపోవడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.

ఇలా అయితే మీ జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రి ఎందుకు ? ఆయ‌న్ను త‌ప్పించ‌మంటారా ? అని కూడా బాబు వారిపై ఫైర‌య్యారు. స‌మాచారం లోపం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని, ఇక‌పై అలా జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌ని గుంటూరు జిల్లా నేత‌లు చెప్ప‌డంతో ఆయ‌న కాస్త శాంతించార‌ట‌. ఇక ఇటీవ‌ల పార్టీకి వ్య‌తిరేకంగా మాట్లాడుతోన్న వారిపై కూడా బాబు సీరియ‌స్ అయ్యార‌ట‌. ఇలాంటి వారి విష‌యంలో ఇక తాను ఉపేక్షించ‌న‌ని కూడా బాబు చెప్పార‌ట‌. ఏదేమైనా టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం చాలా హాట్‌హాట్‌గానే జ‌రిగింది.