జ‌గ‌న్ ప‌థ‌కాల‌తో బాబుకు చెమ‌ట‌లు ప‌డుతున్నాయా

ప్లీన‌రీ వేదిక‌గా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోని ప్ర‌క‌టించేశారు. అన్ని వ‌ర్గాల‌కు ల‌బ్ధి చేకూరేలా ప‌థ‌కాలు వెల్ల‌డించారు. 2019 ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా ప‌క్కా వ్యూహంతో ముందుకొచ్చారు. అందుకు త‌గిన ప్ర‌ణాళిక కూడా ప్ర‌క‌టించేశారు. అయితే ప్ర‌తిప‌క్ష నేత ప్రవేశ‌పెట్టిన ప‌థ‌కాలు ఇప్పుడు టీడీపీ నేత‌లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా రైతు, పేద‌, బ‌డుగు వ‌ర్గాల‌కు చేరువ‌య్యేందుకు 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఎన్నో హామీలు గుప్పించారు. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు జ‌గ‌న్ ప‌థ‌కాలు వెల్ల‌డించ‌డంతో.. చంద్ర‌బాబుకు మెచ్చెమ‌ట‌లు పడుతున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీ.. ఏపీ రాష్ట్ర ప్రజలకు సరికొత్త ధీమా నిచ్చింది. తాను అధికారంలోకి వస్తే.. ఏమేం చేయగలనన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు జగన్. `నవ`రత్నాల్లాంటి సరికొత్త పథకాల్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తానని ప్రకటించారు. కులాలకు.. మతాలకు.. ప్రాంతాలకు.. పార్టీలకు అతీతంగా.. అర్హులైన అందరినీ పథకాల్లో భాగస్వామ్యం చేస్తామ‌ని వెల్లడించారు. జగన్ ప్రకటించిన తొమ్మిది పథకాలకు ప్లీనరీకి హాజరైన కార్యకర్తలు.. పార్టీ నేతలు పూర్తి సంతృప్తి ప్రకటించారు. జగన్ చెప్పిన తొమ్మిది కీలకమైన హామీలు ఏమిటన్నది చూస్తే.. వైఎస్సార్ రైతు భరోసా (లబ్థి పొందే రైతు కుటుంబాలు 66 లక్షలు), వైఎస్సార్ ఆసరా (లబ్థి పొందే డ్వాక్రా మహిళలు 89 లక్షలు) 3. పింఛన్ల పెంపు (లబ్ధిదారుల సంఖ్య 45 లక్షలు).

ప్ర‌స్తుతం అందజేస్తున్న పింఛన్ రూ.1000 నుంచి 2000 పెంచి పక్కాగా అందిస్తాం. అమ్మఒడి (లబ్ధి పొందే విద్యార్థులు 40 లక్షలు), పేదలందరికీ ఇళ్లు (లబ్ధి పొందే కుటుంబాలు 25 లక్షలు), పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తాం. డబ్బు అవసరమైతే ఇంటిని తనఖా పెట్టి పావలావడ్డీకే రుణం ఇచ్చేలా ఏర్పాట్లు. నాటి ఆరోగ్య శ్రీ (లబ్ధి పొందే కుటుంబాలు 1.38 కోట్లు) , ఫీజు రీయింబర్స్మెంట్ (లబ్ధి పొందే విద్యార్థులు 15.80 లక్షలు), జలయజ్ఞం (రైతులందరికీ ప్రయోజనమే), దశల వారీగా మద్య నిషేధం (రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనకరమే). అయితే ఇవన్నీ రైతులు, బ‌డుగులు, మ‌హిళ‌లు ఇలా అన్ని వ‌ర్గాల‌కు చేరువైతే టీడీపీకి ఇబ్బందులే!

రెండేళ్ల ముందే ఇలా అన్ని వ‌ర్గాల‌కు చేరువ‌య్యేలా పథ‌కాలు ప్ర‌క‌టించ‌డంతో.. మ‌రోప‌క్క సీఎం చంద్ర‌బాబులో గుబులు మొద‌లైంది. 2104 ఎన్నిక‌ల్లో డ్వాక్రా రుణాలు, పింఛ‌ను, రైతు రుణ‌మాఫీ ఇలా.. అంద‌రికీ ల‌బ్ధి చేకూరులా వ‌రాలు ప్ర‌క‌టించి చంద్ర‌బాబు సీఎం పీఠం ఎక్కారు. ఇప్పుడు ఇలాంటి ప‌థ‌కాల‌నే జ‌గ‌న్ రెండేళ్ల ముందుగానే ప్ర‌క‌టించ‌డం.. టీడీపీ అధినేత‌కు త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశాలు లేక‌పోలేదు. వీటిక‌న్నా మెరుగైన ప‌థకాలు ప్ర‌వేశ‌పెట్టినావాటిని ఎంత వ‌రకూ న‌మ్ముతారో ఊహించడం క‌ష్టం! ఏదిఏమైనా జ‌గ‌న్ ప‌థ‌కాలు.. చంద్ర‌బాబును ఇరుకున పెట్టేవ‌నేది మాత్రం ఖాయం!!