వాటి ముందు బాబు అనుభ‌వం బ‌లాదూర్‌

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో నాయ‌కుల మ‌ధ్య విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. రాజ‌కీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్న పార్టీ అధినేత చంద్ర‌బాబు కూడా ప‌రిష్క‌రించ‌లేనంత స్థాయిలో అంత‌ర్గ‌త పోరు న‌డుస్తోంది. రాజ‌కీయంగా బ‌ల‌పేందుకు ప్ర‌తిప‌క్ష వైసీపీ నుంచి ఆపరేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చేసుకున్నారు. అప్పుడు రేగిన అసంతృప్తి జ్వాల‌లు ఇంకా ర‌గులుతూనే ఉన్నాయి. వీటిని చ‌ల్లార్చేందుకు చంద్ర‌బాబు చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. వారిని పార్టీ చేర్చుకోవ‌డంలో సూప‌ర్ స‌క్సెస్ అయిన చంద్ర‌బాబు.. వారి చేరిక‌తో వ‌చ్చిన విభేదాలు, అసంతృప్తిని చ‌ల్లార్చ‌డంలో మాత్రం అట్ట‌ర్ ప్లాప్ అయ్యారు.

క‌డ‌ప జిల్లాలో జ‌మ్మ‌ల‌మ‌డుగు, క‌ర్నూలులో నంద్యాల‌, ప్ర‌కాశం జిల్లా, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో వర్గ విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. ఇక్క‌డ వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే చేరిక‌తో ఆయా జిల్లాల్లో స్థానికంగా టీడీపీ నాయ‌కుల్లో తీవ్ర అసంతృప్తి చెల‌రేగింది. ఇప్పటికీ అక్క‌డ ప‌రిస్థితులు కుదుట‌ప‌డ‌టం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్ ఇస్తార‌నే అంశంపై ఇరు వ‌ర్గాల్లోనూ సందేహాలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ఖాయ‌మ‌ని, అప్పుడు అంద‌రికీ టికెట్ ద‌క్కుతుంద‌ని చంద్ర‌బాబు.. వారు చేరిన స‌మ‌యంలో హామీ ఇచ్చారు. కానీ ఇప్ప‌టికీ దీనిపై క్లారిటీ లేక‌పోవ‌డం, ఫిరాయింపుదారుల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌డంతో టీడీపీ నేత‌లు ఆగ్రహం వ్య‌క్తంచేస్తున్నారు.

అయితే వీటిని ప‌రిష్క‌రించ‌డంలో చంద్రబాబు విఫ‌ల‌మ‌య్యారు. వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన నేతలకు, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న నేతలకు మధ్య జరుగుతున్న వార్ ను ఆయన చూస్తూ ఉండిపోతున్నారు. తెలుగుతమ్ముళ్ల మధ్య నడుస్తున్న యుద్ధానికి తెరదించలేకపోతున్నారు. రెండు వర్గాలనూ కూర్చోబెట్టి సంధి కుదిర్చే ప్రయత్నం చేయకపోవడంతో రోజురోజుకూ పార్టీలో అంతర్గత యుద్ధం రోజూ తార స్థాయికి చేరుతోంది. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టి పాటి రవికుమార్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. శంకుస్థాపనల నుంచి ప్రారంభోత్సవాల వరకూ రెండు వర్గాలూ ఢీ అంటే ఢీ అంటున్నాయి. శిలాఫలకం పై పేరు ఉండటాన్ని ఏ వర్గమూ జీర్ణించుకోలేకపోతోంది.

ఇక జ‌మ్మ‌ల మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోనూ దాదాపు ఇదే ప‌రిస్థితి. ఆదినారాయ‌ణ రెడ్డి రాక‌ను రామసుబ్బారెడ్డి వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. అందులోనూ ఆదికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో సుబ్బారెడ్డి వ‌ర్గం అగ్గిమీద‌గుగ్గిలం అవుతోంది. దీంతో ఆయ‌న పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం కూడా వినిపిస్తోంది. ఇక క‌ర్నూలు జిల్లాలో భూమా, శిల్పా వ‌ర్గాల మ‌ధ్య పోరు ఇప్పుడిప్పుడే స‌ద్దుమ‌ణిగింది. అయితే శిల్పామోహ‌న‌రెడ్డి వైసీపీలో చేర‌కుండా చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయి. ఇక విజ‌య‌న‌గ‌రం జిల్లాలోనూ అసంతృప్తి చెల‌రేగుతోంది. అపార రాజ‌కీయ అనుభ‌వ‌మున్నా.. వీట‌న్నింటినీ ప‌రిష్క‌రించ‌డంలో చంద్ర‌బాబు మాత్రం స‌క్సెస్ అవ్వ‌లేదనేది విశ్లేష‌కుల అంచ‌నా!!