2019లో టీ బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా జానారెడ్డి..!

2019 ఎన్నిక‌ల వేళ రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు చాలా ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఏపీలో మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న బీజేపీ-టీడీపీ మ‌ధ్య పొత్తు క‌టిఫ్ అవుతుంద‌ని, అక్క‌డ బీజేపీ వైసీపీకి ద‌గ్గ‌ర‌వుతుంద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక తెలంగాణ‌లోను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా అధికారంలోకి వ‌చ్చేందుకు చాప‌కింద నీరులా ప్ర‌య‌త్నాలు చేస్తోన్న బీజేపీ అక్క‌డ కూడా స‌రికొత్త పొత్తుల‌కు, ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌లేపిన‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణ‌లో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ+టీడీపీ క‌లిసి పోటీ చేశాయి. తెలంగాణ‌లో టీడీపీ ప‌నైపోవ‌డంతో ఆ పార్టీతో క‌లిసి వెళ్ల‌డానికి బీజేపీ ఇష్ట‌ప‌డ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని బీజేపీ ఇప్ప‌టికే చెప్పేసింది. ఈ లెక్క‌న చూస్తే టీ బీజేపీ ఇప్పుడు అక్క‌డ టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ ఇప్పుడు ఆపరేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌లేపింది.

ఈ ఆప‌రేష‌న్‌లో ఏకంగా టీ కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిగా ఉన్న జానారెడ్డిపై గురి పెట్టి, ఆయ‌న్ను త‌మ పార్టీలో చేర్చుకునే విష‌యంలో స‌క్సెస్ అయిన‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి జానారెడ్డికి అన్ని పార్టీల నాయ‌కుల్లోను మంచి పేరుంది. ఆయన పార్టీ మారుతున్నార‌న్న వార్త‌ల‌కు ఊత‌మిచ్చేలా ఆయ‌న తాజాగా ఎన్డీయే ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి వెంక‌య్య‌నాయుడు ఆత్మీయ‌స‌భ‌కు హాజ‌ర‌వ్వ‌డం తెలంగాణ‌లో రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.

ఓ వైపు కాంగ్రెస్‌కు చెందిన గోపాల‌కృష్ణ గాంధీ యూపీఏ నుంచి ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయ‌న‌కు పోటీగా ఉన్న వెంక‌య్య ఆత్మీయ‌స‌భ‌కు కాంగ్రెస్ త‌ర‌పున తెలంగాణ సీఎం రేసులో ఉన్న జానా హాజ‌ర‌వ్వ‌డం కాంగ్రెస్ వ‌ర్గాల‌కు అస్స‌లు మింగుడుప‌డ‌డం లేదు. జానా తీరుపై టీ కాంగ్రెస్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. దీనిపై టీ కాంగ్రెస్ నేత‌లు అధిష్టానానికి ఫిర్యాదు చేయ‌నున్నారు.

ఈ విష‌యం తెలిసినా కూడా జానా లైట్ తీస్కోవ‌డం వెన‌క ఓ కార‌ణం కూడా క‌నిపిస్తోంది. ఆయ‌న బీజేపీలో చేరేందుకు అన్ని సిద్ధ‌మ‌య్యాయ‌ని, అందుకే ఆయ‌న ఎవ‌రేమ‌నుకున్నా తాను చేయాల్సింది చేసేస్తున్నార‌న్న టాక్ న‌డుస్తోంది. తెలంగాణ‌లో ఉన్న రెడ్డి సామాజిక‌వ‌ర్గాన్ని ఆక‌ర్షించే క్ర‌మంలోనే బీజేపీ జానాను త‌మ పార్టీలో చేర్చుకుని ఆయ‌న్ను 2019 ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌ర‌పున సీఎం అభ్య‌ర్థిగా ఎనౌన్స్ చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా జానా ఇప్పుడు టీ పాలిటిక్స్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారాడు.