టీటీడీపీలో మ‌రో ఎమ్మెల్యే జంప్‌..?

రుణ శేషం..శత్రు శేషం ఉండరాదనేది ఓ నానుడి. ఇదే విధానాన్ని తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ అమ‌లు చేస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో టీడీపీనీ కోలుకోలేని దెబ్బ‌తీసిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీకి మిగిలిన ఎమ్మెల్యేల‌ను కూడా త‌మ పార్టీలోకి లాక్కునేందుకు మ‌రోసారి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ప్లాన్ వేసింద‌న్న చ‌ర్చ‌లు టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలంగాణ‌లో టీడీపీని దాదాపు ఖాళీ చేసేసిన గులాబీ పార్టీ తాజాగా అక్క‌డ ప‌సుపు పార్టీని అంద‌రూ మ‌ర్చిపోయేలా చేసే ప‌నిలో బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇటీవ‌లే ఆదిలాబాద్ మాజీ ఎంపీ ర‌మేష్ రాథోడ్‌కు గులాబీ కండువా క‌ప్పిన అధికార పార్టీ నేత‌లు త్వ‌ర‌లోనే మ‌రో టీడీపీ ఎమ్మెల్యేను సైతం త‌మ పార్టీలో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి మూడేళ్లు అయిన సంద‌ర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీల వాళ్లు సంబ‌రాలు చేసుకుంటుంటే చంద్ర‌బాబు తెలంగాణా అవతరణ దినోత్సవాన్ని ఓ చీకటి రోజుగా అభివర్ణించడాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు.

తెలంగాణ విష‌యంలో బాబు వైఖ‌రి గ‌మ‌నించి మిగిలిన టీ-టీడీపీ నేత‌లు ఇప్ప‌టికి అయినా త‌మ పార్టీలోకి వ‌చ్చేయాల‌ని వారు పిలుపునిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డ అస్స‌లు టీడీపీ అనేదే లేకుండా చేయాల‌ని గులాబీ పార్టీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

సైకిల్‌ను వీడి కారెక్కనున్న ఎమ్మెల్యే సండ్ర‌…..

ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య రూటు సైతం టీఆర్ఎస్ వైపే ఉన్న‌ట్టు తెలుస్తోంది. మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు అనుచ‌రుడైన సండ్ర తుమ్మ‌ల పార్టీ మారినా ఆయ‌న మాత్రం టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. ఓటుకు నోటు కేసు త‌ర్వాత సండ్ర కాస్త సైలెంట్ అయ్యారు.

ఇక తెలంగాణ‌లో టీడీపీకి ఫ్యూచ‌ర్ లేద‌ని డిసైడ్ అయిన సండ్ర త‌న ఫ్యూచ‌ర్ కోసం కారెక్కేసేందుకు రెడీ అయిన‌ట్టే తెలుస్తోంది. ఆయ‌న పార్టీ మార‌డం ఖాయ‌మైనా ఎప్పుడు మార‌తారు ? అన్న‌దే తేలాల్సి ఉంద‌ని గులాబీ నేత‌లు కూడా త‌మ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఏద‌మైనా సండ్ర కూడా జంప్ చేసేస్తే టీటీడీపీకి మ‌రో షాక్ త‌గిలిన‌ట్టే..!