వైసీపీ లో ఘంటా పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఎటు..!

ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల్లో ఘంటా ముర‌ళీ రామ‌కృష్ణ (ముర‌ళీ) అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ స‌మైక్యాంధ్ర రాజ‌కీయాల్లో కాక‌లు తీరిన మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావును ఓడించిన ఓ సంచ‌ల‌న వ్య‌క్తిగా మాత్రం ఘంటా ముర‌ళీ తెలుసు. అతి సామాన్యుడైన ముర‌ళీ 2004లో ఐదుసార్లు గెలిచిన త‌ల‌పండిన రాజ‌కీయ‌వేత్త‌, దివంగ‌త మాజీ మంత్రి కోట‌గిరిని ఓడిచి పెద్ద సంచ‌ల‌నం సృష్టించారు.

2004లో చింత‌ల‌పూడి ఎమ్మెల్యే అయిన ముర‌ళీ ఆ త‌ర్వాత అది రిజ‌ర్వ్ కావ‌డంతో కిర‌ణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు ఏపీఐడీసీ చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత వైసీపీలో చేరిన ముర‌ళీ చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ క‌న్వీన‌ర్‌గా ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అంతా బాగానే ఉన్నా కోట‌గిరి త‌న‌యుడు కోట‌గిరి శ్రీథ‌ర్ వైసీపీలో చేర‌డం, జ‌గ‌న్ ఆయ‌న్ను ఏలూరు లోక్‌స‌భ ఇన్‌చార్జ్‌గా నియ‌మించ‌డంతో చింత‌ల‌పూడి వైసీపీ రాజ‌కీయాలు ఎత్తులు, పైఎత్తుల‌తో ఆస‌క్తిక‌రంగా మారాయి.

క‌మ్మ సామాజిక‌వ‌ర్గం అంటేనే టీడీపీకి బ‌లంగా కొమ్ముకాస్తుంది. అయితే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని మెట్ట‌ప్రాంతంలో కీల‌క నాయ‌కులు అంద‌రూ టీడీపీలో ఉన్నా ముర‌ళీ మాత్రం వైసీపీలో ఉన్నారు. చివ‌ర‌కు ఆయ‌న గురువు మాజీ కేంద్ర‌మంత్రి కావూరు సాంబ‌శివ‌రావు సైతం బీజేపీలో చేరినా ముర‌ళీ మాత్రం వైసీపీలోనే కొన‌సాగుతున్నారు. ఇక కోట‌గిరి శ్రీథ‌ర్ వైసీపీ ఎంట్రీతో చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీలోను, వైసీపీలోను ఉన్న ముర‌ళీ వ్య‌తిరేక‌వ‌ర్గం అంతా ఒక్క‌ట‌వుతోంది.

ముర‌ళీని రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కేందుకు వీరంతా తెర‌వెన‌క పావులు క‌దుపుతున్నారు. ప్ర‌స్తుతం వైసీపీలో ముర‌ళీ ప‌రిస్థితి అడ‌క‌త్త‌ర‌లో పోక‌చెక్క‌లా మారింది. ఆయ‌న టీడీపీలోకి వెళ్ళటానికి ఇష్టపడే పరిస్థితి లేదు. వైసీపీలో ఉంటే ఇటు స్వ‌ప‌క్ష‌మైన వైసీపీలోని ప్ర‌త్య‌ర్థుల‌తో పాటు అటు అధికార‌ప‌క్ష‌మైన టీడీపీలోని ప్ర‌త్య‌ర్థుల‌తోను పోరాడాల్సి వ‌స్తోంది.

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ముర‌ళీని రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కేందుకు ఎవ‌రెన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా మెట్ట ప్రాంతంలోని క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేగా ఉండ‌డం ఆయ‌నకు బ‌ల‌మైన అనుకూలాంశంగా మారింది. ఇప్ప‌ట‌కీ నియోజ‌క‌వర్గంలో బ‌లంగా ఉన్న ఆయ‌న వ‌ర్గానికి చెందిన వారు ఆయ‌న‌కు అండ‌గా ఉంటున్నారు.

వాస్త‌వానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ ముర‌ళీ కంటే కోట‌గిరి శ్రీథ‌ర్‌, కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు, కెవిపి.రామ‌చంద్ర‌రావు స‌మీప బంధువు అయిన మేడ‌వ‌ర‌పు అశోక్ (చింత‌ల‌పూడి ఏఎంసీ మాజీ చైర్మ‌న్‌)కే ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తార‌న్న అంశంలో ఎలాంటి డౌట్ లేదు. ఒక వేళ ఆ ఇద్ద‌రికి ప్ర‌యారిటీ ఇచ్చే క్ర‌మంలో జ‌గ‌న్ ముర‌ళీని వ‌దులుకుంటే వైసీపీలో ఉన్న ముర‌ళీ  వ‌ర్గం ఆ పార్టీకి మ‌రింత దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. ఇది జిల్లాలో ఆ సామాజిక‌వ‌ర్గంలో వైసీపీపై మ‌రింత ఎఫెక్ట్ ప‌డ‌డం ఖాయం. జిల్లాలో ఈ వ‌ర్గం నుంచి వైసీపీలో బ‌ల‌మైన నాయ‌కుల్లో మాజీ ఎమ్మెల్యే కృష్ణ‌బాబు త‌ప్ప ఎవ్వ‌రూ లేరు. మెట్ట ప్రాంతంలో ఉన్న ముర‌ళీని జ‌గ‌న్ వ‌దులుకుంటే ఆ ఇంప్యాక్ట్ ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న ఈ వ‌ర్గం ఓటర్ల‌పై త‌ప్ప‌కుండా ఉంటుంది.

ఒక వేళ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో చింత‌ల‌పూడి లేదా జంగారెడ్డిగూడెం జ‌నర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంగా ఏర్ప‌డితే వైసీపీ అభ్య‌ర్థిగా ముర‌ళీ రంగంలోనూ ఉండొచ్చు. అప్పుడు వీరిద్ద‌రిలో ఎవ‌రు ఎవ‌రికి స‌హ‌క‌రించుకోపోయినా ఇద్ద‌రూ లాస్ అవ్వ‌డంతో పాటు వైసీపీ ఘోరంగా దెబ్బ‌తిన‌డం ఖాయం.