12 మంది ఎమ్మెల్యేల‌కు బాబు స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు కోపం వ‌స్తే అటు ప‌క్క‌న ఎలాంటి వారున్నా ఆయ‌న ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌దు. తాజాగా ఏపీలో న‌వ‌నిర్మాణ దీక్ష‌ను ప్రారంభించాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ దీక్ష‌కు 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు డుమ్మా కొట్టారు. తాను ఎంతో సీరియ‌స్‌గా ఈ దీక్ష‌లో అంద‌రు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గోవాల‌ని పిలుపునిస్తే కొంత‌మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు త‌న మాట ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు.

అమ‌రావ‌తిలోని త‌న నివాసంలో త‌మ పార్టీ నేత‌ల‌తో భేటీ అయిన చంద్ర‌బాబు దీక్ష‌పై వివ‌రాలు సేక‌రించారు. ఈ రోజు దీక్ష‌లో 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్ద‌రు ఎంపీలు పాల్గొన‌లేద‌ని తెలుసుకుని, వారిపై సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిర్లక్ష్య‌పు ధోర‌ణిలో ఉంటే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చార‌ని స‌మాచారం.

క‌నీసం రేప‌టి నుంచి ఈ నెల 7వ తేదీ వ‌ర‌కు జ‌రిగే దీక్ష‌లో అయినా పాల్గోవాల‌ని ఆయ‌న సూచించారు. దీక్ష‌కు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కొంద‌రికి చంద్ర‌బాబు ఫోన్లు చేసి మ‌రీ వార్నింగ్ ఇచ్చార‌ట‌. ఇక ఏకంగా ఏడు రోజుల పాటు ఈ దీక్ష పెట్ట‌డం చాలా మంది ఓ ప్ర‌హ‌స‌నమంటూ విమ‌ర్శిస్తున్నారు.

విజ‌య‌వాడ‌లోని బెంజ్‌స‌ర్కిల్ వ‌ద్ద సీఎం చంద్ర‌బాబు పాల్గొన్న దీక్ష సైతం అట్ట‌ర్‌ప్లాప్ అయ్యింద‌న్న టాక్ వ‌చ్చేసింది. భారీ ఎత్తున జ‌నాలు వ‌స్తార‌నుకున్నా చాలా కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. విజ‌య‌వాడ మార్క్ ఎండ‌దెబ్బ‌కు వ‌చ్చిన వారు కూడా తొంద‌ర‌గానే తిరుగుముఖం ప‌ట్టేశారు.