టీడీపీ ప‌రిస్థితి మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారనుందా..!

ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌వుతోంది. ఈ మూడేళ్ల‌లో పార్టీ ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొంది. అయితే ప్ర‌స్తుతం పార్టీ ప‌రిస్థితి ఆ పార్టీలో లుక‌లుక‌లు పార్టీ ఆవిర్భ‌వించిన ఈ మూడున్న‌ర ద‌శాబ్దాల‌లో ఎప్పుడూ లేనంత‌గా ఉన్నాయి. పార్టీలో ప్ర‌స్తుతం ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన జంపింగ్ జ‌పాంగ్‌ల దెబ్బ‌తో డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి. ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో పార్టీకి తీర‌ని న‌ష్టం క‌ల‌గ‌క మాన‌దు. అన్ని జిల్లాల్లోను మంత్రులు, నాయ‌కుల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు.

తాజాగా విశాఖ జిల్లాలో మంత్రి గంటా మ‌రో మంత్రి అయ్య‌న్న‌పై ఏకంగా చంద్ర‌బాబుకే లేఖ రాశారు. వీరి మధ్య వార్ తొలినుంచే ఉంది. గంటాను పార్టీలోకి చేర్చుకోవడం అయ్యన్నకు ఇష్టం లేదు. అయ్య‌న్న ముందు నుంచి పార్టీలోనే ఉన్నారు. గంటా ప‌లు పార్టీలు మారి తిరిగి టీడీపీలోకి వ‌చ్చారు. వీరి మ‌ధ్య ఇప్పుడు కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది.

ఇక క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులో మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి, ప్ర‌కాశం జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌, ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి. నంద్యాల‌లో చివ‌ర‌కు శిల్పా మోహ‌న్‌రెడ్డి పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయే వ‌ర‌కు వార్ ఆగ‌లేదు.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మంత్రి సుజయకృష్ణ రంగారావుకు ఇచ్చిన ప్రాధాన్యత కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు ఇవ్వడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఇటీవ‌ల మాజీ మంత్రి గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి మాట్లాడుతూ పార్టీలో బ‌య‌ట నుంచి వ‌చ్చిన వ్య‌క్తుల‌కు సిద్ధాంతాల‌తో ప‌నిలేద‌ని, వారి వ‌ల్లే క్ర‌మ‌శిక్ష‌ణ లోపిస్తోంద‌ని చెప్పారు. ఇప్పుడు ఆయ‌న మాట‌లు అక్ష‌ర స‌త్యాలే అయిన‌ట్టు క‌న‌ప‌డుతోంది.

ఏదేమైనా టీడీపీలో జంపింగ్ జ‌పాంగ్స్ వ‌ల్లే పార్టీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి. చంద్ర‌బాబు ఇప్ప‌ట‌కీ అయినా న‌ష్ట నివార‌ణ చర్య‌లు చేప‌ట్ట‌క పోతే ప‌రిస్థితి మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మార‌క‌త‌ప్ప‌దు.