టీఆర్ఎస్ లో కండువా రచ్చ

గత ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన ఇద్దరు ఎంపీల్లో ఒకరైన గుత్తా సుఖేందర్ రెడ్డి… ఆ తరువాత టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. తనతో పాటు మిర్యాలగూడ ఎంపీని సైతం ఆయన టీఆర్ఎస్ లోకి తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తనపై వేటు పడుతుందనే ఉద్దేశమో ఏమో తెలియదు కానీ… ఒక్క విషయంలో మాత్రం ఆయన మరీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

టీఆర్ఎస్ లో చేరే సమయంలోనూ ఆ పార్టీ కండువా కప్పుకోని గుత్తా సుఖేందర్ రెడ్డి… ఆ తరువాత కూడా ఎక్కడా టీఆర్ఎస్ కండువా కప్పుకుని దాఖలాలు లేవు. గుత్తాపై గతంలోనే లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు… ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నట్టు ఉన్న ఫోటోలు దొరికితే… మరోసారి స్పీకర్ కు ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యారట. ఈ విషయం తెలుసుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి… కాంగ్రెస్ నేతలకు దొరక్కుండా తెలివిగా వ్యవహరిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి హాజరైన గుత్తా సుఖేందర్ రెడ్డి… రిజిస్టర్ లో సంతకం పెట్టకుండా, టీఆర్ఎస్ కండువా కప్పుకోకుండా ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలుస్తోంది. ఓ వైపు టీడీపీ ఎంపీ మల్లారెడ్డి… ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటే… నల్లగొండ ఎంపీ మాత్రం ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తుండటంతో…ఆయన మళ్లీ ఎన్నికలకు సిద్ధంగా లేరనే గుసగుసలు వినిపిస్తున్నాయి.