ప‌వ‌న్ యువ టార్గెట్ స‌ఫ‌ల‌మ‌య్యేనా?

లేటుగా వ‌చ్చినా లేటెస్ట్‌గా వ‌చ్చాననేది. ఓ సినిమా డైలాగ్‌! ఇప్పుడు ఇదే డైలాగ్‌ను నిజం చేయాల‌ని చూస్తున్నాడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఈయ‌న 2014లో పొలిటిక‌ల్‌గా సొంతం పార్టీ ఫామ్ చేసినా.. అప్ప‌ట్లో ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే కాకుండా.. టీడీపీ, బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చాడు. ఇప్పుడు 2019 ఎన్నిక‌లు రెడీ అవుతున్నాయి. దీనిలో పోటీ అనివార్య‌మ‌ని భావించిన ప‌వ‌న్‌.. తాజాగా ఎక్క‌డెక్క‌డ ఎలాంటి అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపాలో ప‌క్క ప్ర‌ణాళిక‌తో ముందుకు పోతున్నాడు.

ఈ క్ర‌మంలోనే త‌న పార్టీలో యువ‌త‌కు పెద్ద పీట వేయాల‌ని ప‌వ‌న్ డిసైడ్ అయ్యాడు. అనుకున్న‌దే త‌డువుగా.. త‌న పార్టీలోకి ఎవ‌రిని ప‌డితే వారిని తామ‌ర తంప‌రగా చేర్చుకోకుండా వారిలో ఉన్నస్కిల్స్‌కి ప‌దును పెట్టి ప‌నికి వ‌స్తారు! అని అనుకున్న వారినే పార్టీలో చేర్చుకుంటున్నాడు .ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున ప‌రీక్ష‌లు గ‌ట్రా నిర్వ‌హించేశాడు. తాజాగా నెల్లూరులో జనసేన కార్యకర్తల ఎంపిక జరుగుతోంది. అయితే వీరివల్ల పవన్ కు, పార్టీకి ఎంతవరకూ లాభం ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఎంపిక చేసిన జనసైనికులకు శిక్షణ ఇప్పించి క్షేత్రస్థాయిలో పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగిస్తారు. వీరు సమస్యలను గుర్తించడమే కాకుండా వాటిపై పూర్తి అవగాహన పెంచుకుని స్పందించాల్సి ఉంటుంది. అయితే అనలిస్టులు, కంటెంట్ రైటర్స్, స్పీకర్స్ ను జనసేన అధినేత ఎంపిక చేస్తున్నారు. వీరందరూ జనసేన తరుపున గళం విప్పాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా, కేవలం సేవాభావం కలిగిన యువకుల వల్ల పార్టీకి ఎంతవరకూ ఉపయోగం ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ యువ టార్గెట్ ఎంత మేర‌కు స‌ఫ‌ల‌మ‌వుతుంద‌ని విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనికి స‌మాధానం రావాలంటే.. కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.