బాబు గ్యాంగ్‌లో అవినీతి ప‌రులు.. టీడీపీకి దెబ్బే!!

నేను నిప్పు! అవినీతిని స‌హించేది లేదు!! భ‌రించేది అంత‌క‌న్నాలేదు!! అని ప‌దే ప‌దే వ‌ల్లించే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్పుడు అడ్డంగా బుక్క‌య్యారు. ఎందుకంటే.. ఆయ‌న ప‌రివారం ఒక్క‌రొక్క‌రుగా ఇప్పుడు అవినీతి ఉచ్చులో చిక్కుకోవ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఎమ్మెల్సీ వాకాటిపై అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చీ ఇవ్వ‌డంతోనే ఆయ‌న ఇంట్లో అధికారులు త‌నిఖీలు చేశారు. దీంతో ఎక్క‌డ ఆ అప‌వాదు.. త‌న‌మీద‌కి వ‌చ్చి ప‌డుతుందోన‌ని భావించిన బాబు.. త‌క్ష‌ణ‌మే ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా తెలంగాణ‌లో టీడీపీ ఎమ్మెల్సీని అధికారులు నేరుగా అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణాను ప‌ట్టి కుదిపేస్తున్న భూ క‌బ్జా వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే టీడీపీ నేత‌ల పేర్లు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే టీడీపీ ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇక‌, ఏపీలో విశాఖ భూ క‌బ్జా కేసులోనూ సాక్షాత్తూ మంత్రుల పేర్లు తెర‌మీద‌కి వ‌స్తున్నాయి. తానునిప్పున‌ని చెప్పుకొనే చంద్ర‌బాబు వీటిని ఎలా డీల్ చేస్తారోన‌ని అంద‌రూ ఎదురు చూస్తున్నారు.

నిజానికి ఈ వ్య‌వ‌హారం పార్టీలో కలకలం రేపుతోంది. ఇది ఖచ్చితంగా పార్టీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేదే అని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీపక్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ జె సి దివాకర్ రెడ్డి మేనల్లడే. హైదరాబాద్ లో వందల కోట్ల రూపాయల విలువ చేసే 78 ఎకరాల భూ కబ్జా కేసులో హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు మంగళవారం దీపక్ రెడ్డితో న్యాయవాది శైలేష్‌ సక్సేనాతో పాటు మరో నిందితుడిని అరెస్టు చేశారు. ఏదేమైనా తాను నిప్పున‌ని చెప్పుకొనే చంద్ర‌బాబు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. గాలి ఎప్పుడూ విప‌క్షం వైపే ఉండ‌దు.. ఇప్పుడు అధికార ప‌క్షం వైపు కూడా మ‌ళ్లింది. దీనిని బాబు స్పంద‌న ఏంటో చూడాలి.