కెసిఆర్ ఆఫర్ ఓకే ముహూర్తం కోసం వెయిటింగ్

తెలంగాణ‌లోని పాత న‌ల్గొండ జిల్లాకు చెందిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ సంచ‌ల‌నాల‌కు మారుపేరు. కాంగ్రెస్ త‌ర‌పున కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి న‌ల్గొండ ఎమ్మెల్యేగా ఉంటే, ఆయ‌న సోద‌రుడు రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. దూకుడు రాజ‌కీయాల‌ను, సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు మారు పేరు అయిన వీరిపై రాజ‌కీయంగా మ‌రో సంచ‌ల‌న రూమ‌ర్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ గ‌తంలోనే పీసీసీ చీఫ్ ప‌ద‌వి త‌మ‌దే అన్నారు. ఉత్త‌మ్ వీక్ ప్రెసిడెంట్ పార్టీ ఎలా న‌డుపుతార‌ని ప్ర‌శ్నించారు.. ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన న‌ల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజ్‌గోపాల్‌రెడ్డి గెలుపుతో వీరు సీఎం కేసీఆర్‌కే షాక్ ఇచ్చారు…ఆ త‌ర్వాత ఈ బ్ర‌ద‌ర్స్ పీసీసీ పీఠం మాదే…ఉత్త‌మ్ అవుట్ అని ప్ర‌చారం చేశారు. క‌ట్ చేస్తే ఇప్పుడు వీరికి టీ కాంగ్రెస్‌లో వాయిస్ లేకుండా పోయింది.

ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిని పీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు వీరి వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవ్వ‌డం, వీరిని కాంగ్రెస్ హైక‌మాండ్ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో రాజ‌కీయంగా వీరు సైలెంట్ అయ్యారు. ఇక తాజాగా సంగారెడ్డిలో జ‌రిగిన రాహుల్‌గాంధీ స‌భ‌ను సైతం వీరు లైట్ తీసుకున్నారు. ఈ స‌భ‌కు ఎమ్మెల్సీ రాజగోపాల్ హాజరుకాలేదు. ఇక రాహుల్ రాక‌కు ముందే ప్ర‌సంగించిన కోమ‌టిరెడ్డి ఆ వెంట‌నే అక్క‌డ నుంచి జారుకున్నారు.

ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం రోజు సోనియాను పిలిచి న‌ల్గొండ‌లో భారీ స‌భ ఏర్పాటు చేయాల‌ని వీరు ఆర్భాటంగా ప్ర‌క‌టించినా అది నెర‌వేర‌లేదు. ఈ స‌భ‌కు హైక‌మాండ్ నో చెప్పింద‌ట‌. త‌మ మాట చెల్లుబాటు కాక‌పోవ‌డంతో వీరు కాంగ్రెస్‌ను వీడాల‌న్న నిర్ణ‌యానికి దాదాపు వ‌చ్చేశార‌న్న గుస‌గుస‌లు టీ కాంగ్రెస్‌లోనే వినిపిస్తున్నాయి.

కేసీఆర్ ఆఫ‌ర్ కార‌ణ‌మా…?

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ మంచి ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. పార్టీలో చేరితే వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత కోమ‌టిరెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు రాజ్‌గోపాల్‌రెడ్డికి ఎమ్మెల్యే సీటు లేదా ఎమ్మెల్సీ ఇస్తాన‌ని కేసీఆర్ నుంచి వీరికి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ జంప్ చేసేందుకు స‌రైన టైం కోసం వెయిట్ చేస్తోన్న వీరు కాంగ్రెస్‌లో నామ్‌కే వాస్తే పాత్ర పోషిస్తున్నార‌ని స‌మాచారం.