ఆ ఎమ్మెల్యే దంపతులు టీఆర్ఎస్ లో ఇమడలేక పోతున్నారా.!

వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ‌, ముర‌ళీ దంప‌తుల పేరు చెపితే స‌మైక్య రాష్ట్ర రాజ‌కీయాల్లోనే తెలియ‌ని వారు ఉండ‌రు. కాంగ్రెస్‌లో లేడీ ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న 1999, 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా గెలిచి వైఎస్ హ‌యాంలో మంత్రి అయ్యారు. వైఎస్‌తో సురేఖ దంప‌తుల‌కు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. 2008లో ఆమె వైఎస్ సూచ‌న మేర‌కు హ‌న్మ‌కొండ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. త‌ర్వాత జ‌గ‌న్ వైసీపీలో చేరిన సురేఖ త‌న మంత్రి ప‌ద‌వి వ‌దులుకుని 2012లో ప‌ర‌కాల ఉప ఎన్నిక‌ల్లోను పోటీ చేసి ఓడిపోయారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీఆర్ఎస్‌లోకి జంప్ చేసిన సురేఖ వ‌రంగ‌ల్ తూర్పు నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్ర‌స్తుతం సురేఖ‌ ఎమ్మెల్యేగాను, ముర‌ళీ ఎమ్మెల్సీగాను కొన‌సాగుతున్నారు. ఉమ్మ‌డి వరంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల్లో త‌మదైన ముద్ర కొండా ఫ్యామిలీది. అయితే గ‌త 20 ఏళ్ల‌లో కొండా దంప‌తుల‌కు యాంటీగా రాజ‌కీయాలు న‌డిపిన వారంద‌రు ఇప్పుడు టీఆర్ఎస్‌లోనే ఉన్నారు.

ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, క‌డియం శ్రీహ‌రి, దాస్యం విన‌య్‌భాస్క‌ర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలానే ఉంది. ఈ క్ర‌మంలోనే టీఆర్ఎస్‌లో ఇప్పుడు కొండా దంప‌తుల‌ను ప‌ట్టించుకునే వారే లేరు. ఇక్క‌డ త‌మకు స‌రైన ప్ర‌యారిటీ లేద‌ని భావిస్తోన్న కొండా దంప‌తులు తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్నార‌న్న వార్త‌లు వ‌రంగ‌ల్ జిల్లాలో వినిపిస్తున్నాయి

తాజాగా ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ సంగారెడ్డిలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ అంశాల‌పై కొండా దంప‌తులు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చిన‌ట్టు స‌మాచారం. వ‌రంగ‌ల్‌కు చెందిన కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల‌ను సైతం ముర‌ళీ దంప‌తులు ఇంటికి పిలిపించుకుని కాంగ్రెస్ స‌భ ఎలా జ‌రిగింద‌న్న అంశాలు తెలుసుకున్నార‌ట‌. కాంగ్రెస్‌పై మ‌మ‌కారం లేక‌పోతే కొండా దంప‌తులు రాహుల్ స‌భ గురించి ఎందుకు ఆరా తీస్తార‌న్న ప్ర‌శ్న‌లు న‌గ‌రంలో వినిపిస్తున్నాయి.

ఇక కొండా ముర‌ళీ సైతం సురేఖ‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌న‌ప్పుడు టీఆర్ఎస్‌లో ఉండి లాభం ఏంట‌ని ? త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నార‌ట‌. ఏదేమైనా కొండా దంప‌తులు టీఆర్ఎస్‌లో ఇమ‌డ లేక‌పోతున్నార‌ని..ఈ రెండేళ్ల త‌ర్వాత వారు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తితో ఉన్నార‌న్న వార్త‌లే జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి.