చంద్ర‌బాబుతో టీడీపీ ఎంపీ తాడో.. పేడో..!

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని.. మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. నిన్న బెంజ్ స‌ర్కిల్‌వ‌ద్ద ఫ్లైవోవ‌ర్‌కి శంకు స్థాప‌న చేసిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న ర‌వాణా శాఖ‌పై ఓ రేంజ్‌లో ఫైర‌య్యాడు. అవినీతికి చిరునామాగా ర‌వాణా శాఖ ఉంద‌ని భారీ కామెంట్ చేశాడు. నిజాయితీ గ‌ల టీడీపీ కార్య‌క‌ర్త‌గా తాను సిగ్గుప‌డుతున్నాన‌ని అన్నారు. ర‌వాణా శాఖ అవినీతి వ‌ల్లే ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఇవ‌న్నీ చూస్తుంటే.. కేశినేని ఇదంతా ఏదో వ్యూహం ప్ర‌కారం చేస్తున్న‌ట్టే అనిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

రెండు నెల‌ల కింద‌ట విజ‌య‌వాడ ర‌వాణా శాఖ కార్యాల‌యంలో భారీ హంగామా సృషించాడు కేశినేని. త‌న బ‌స్సుల‌నే అడ్డుకుంటున్నార‌ని, అంద‌రినీ స‌మానంగా చూడాల‌ని నేరుగా క‌మిష‌న‌ర్‌పైనే కామెంట్లు కురిపించాడు. ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే ఎక్క‌డికి పోతావో తెలుసా? అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు కుమ్మ‌రించాడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అల‌జ‌డి సృష్టించింది. ఇంత‌లో పెద్ద‌ది కాకుండా చూసేందుకు నేరుగా రంగంలోకి దిగిన సీఎం చంద్ర‌బాబు ర‌వాణా క‌మిష‌న‌ర్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పించారు. ఇది అంత‌టితో అయిపోయింద‌ని అంద‌రూ అనుకున్నారు.

ఇక‌, ఇప్పుడు మ‌రోసారి రెచ్చిపోయిన కేశినేని.. క‌సినేనిగా మారిపోయాడు. అరుణాచ‌ల్ అధికారులు గ్రేట్ అంటూ .. ఓ ఎంపీ లేఖ రాస్తేనే వంద‌ల కొద్దీ బ‌ళ్ల‌కు రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు చేశార‌ని తెలిపారు. అలాంటి స‌త్తువ, శ‌క్తి ఇక్క‌డి అధికారుల‌కు లేవ‌ని అన్నాడు. అందుకేతాను బ‌స్సుల ట్రావెల్స్ నుంచి విర‌మించుకున్న‌ట్టు తెలిపారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. నిన్న‌టి కామెంట్లు నేరుగా అటు అధికారులు, ర‌వాణా శాఖే కాకుండా చంద్ర‌బాబుకు కూడా త‌గిలేవిగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న రంగం ర‌వాణా. దీనిని కేశినేని త‌క్కువ చేసి మాట్టాడ‌డం, అవినీతి మొత్తం ర‌వాణా శాఖ‌లోనే ఉంద‌ని అన‌డం ద్వారా ఆయ‌న నేరుగా ప్ర‌భుత్వాన్ని, టీడీపీ అధినేత‌నే టార్గెట్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో జ‌రిగిన గొడవ స‌మ‌యంలోనే సీరియ‌స్‌గా స్పందించిన సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌డు మ‌రింత స్పీడ్‌గా స్పందిస్తార‌ని తెలిసి కూడా .. కేశినేని ఇలా మాట్లాడాడంటే.. ఎంత‌కైనా రెడీ అనే సిగ్న‌ల్స్ పంపుతున్నాడ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి భ‌విష్య‌త్‌లో ఏం జ‌రుగుతుందో చూడాలి.