రాహుల్‌ను కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా.. ?

తెలంగాణ మూడో ఆవిర్భావ దినోత్సవానికి ఒక్క రోజు ముందు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వెళ్లారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ సూపర్ సక్సెస్ అయ్యిందని కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా… కాంగ్రెస్ విమర్శలను టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకునే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

రాహుల్ చేసిన విమర్శలకు కేటీఆర్, హరీశ్, కవిత వంటి వాళ్లు మాత్రమే స్పందిస్తారని తెలుస్తోంది. అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించిన విధంగా కేసీఆర్… రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఏ మాత్రం లేదని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల రాహుల్ కు, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశం ఉందని భావించడం వల్లే అమిత్ షా వ్యాఖ్యలకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చి బీజేపీ శ్రేణులను నైతికంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారని… కాంగ్రెస్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అలాంటి ప్రయత్నం చేసే అవకాశం లేదని టీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం రాహుల్ వ్యాఖ్యలపై స్పందించని కేసీఆర్… సమయం చూసుకుని ఆయనకు కూడా కౌంటర్ ఇచ్చే అవకాశం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాహుల్ సభను లైట్ తీసుకోవడం కూడా కేసీఆర్ వ్యూహాంలో భాగమే అని స్పష్టమవుతోంది.