తెలంగాణ‌లో ఆ రెండు పార్టీల పొత్తు లేన‌ట్టే..

తెలంగాణ‌లో టీడీపీ బ‌లం గురించి మాట్లాడుకోవ‌డం టైం వేస్ట్ అవుతుంద‌న్న లెక్క‌కు రాజ‌కీయ ప‌రిశీల‌కులు, మేథావులు వ‌చ్చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీడీపీ ఒక్క సీటు అయినా గెలుచుకుంటుందా ? అంటే డౌటే అంటున్నారు. టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే సిట్టింగ్ సీటు కొడంగ‌ల్ వ‌దులుకుని క‌ల్వ‌కుర్తి నుంచి పోటీ చేసే అంశంపై ఆలోచ‌న‌లు చేస్తున్నారు. దీనిని బ‌ట్టి అక్క‌డ టీడీపీ ప‌రిస్థితి ఎంత దిగ‌జారిందో అర్థ‌మ‌వుతోంది.

ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్‌పై స్ట్రాంగ్ ఫైట్ చేస్తోన్న రేవంత్‌రెడ్డి ఇటీవ‌ల ప‌దే ప‌దే పొత్తుల ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు తాము అవ‌స‌ర‌మైతే కాంగ్రెస్‌తో అయినా పొత్తుకు రెడీ అని ప్ర‌క‌టించారు. ఇలా పొత్తుల ద్వారా తెలంగాణలో బలపడాలని ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీలో ఆదిలోనే షాక్ త‌గిలింది.

కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ అయిన రేవంత్ చేసిన ప్ర‌క‌ట‌న ఇటీవ‌ల రాజ‌కీయ వ‌ర్గాల్లో బాగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీనిపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి స్పందిస్తూ సుముఖ‌త వ్య‌క్తం చేశారు. అయితే పొంగులేటి లాంటి కొంద‌రు మాత్రం టీడీపీతో పొత్తును వ్య‌తిరేకించారు. ఈ వార్ ఇలా జ‌రుగుతూ ఉండ‌గానే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి – కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ అంశంపై స్పందించారు.

ఏపీలో టీడీపీని వ్య‌తిరేకిస్తూ తెలంగాణ‌లో ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటామ‌ని ప్ర‌శ్నించారు. ఇక టీటీడీపీతో పొత్తుపై జైపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు త‌న‌కు తెలియ‌ద‌న్నారు. దిగ్విజ‌య్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి తెలంగాణ‌లో టీడీపీ+కాంగ్రెస్ పొత్తు క‌లలో కూడా జ‌రిగేప‌నికాద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.