బాబూ… ఏపీ క‌ష్టాల్లో ఉన్నా.. ఇన్ని క్యాంప్ ఆఫీస్‌లా? 

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎప్పుడు ఎక్క‌డ స‌భ‌లో మాట్లాడాల్సి వ‌చ్చినా.. తాను సీఎంగా ఉన్న రాష్ట్రం ఎన్నో క‌ష్టాల్లో ఉంద‌ని, ఎన్నో న‌ష్టాలు చ‌విచూస్తున్నామ‌ని చెప్పుకొస్తారు. లోటు బ‌డ్జెట్‌తో ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగా ఉంద‌ని, అయినా .. తాను కాబ‌ట్టి రాష్ట్రాన్ని లైన్‌లో పెడుతున్నాన‌ని పెద్ద పెద్ద డైలాగులు చెబుతారు. వ‌చ్చిన వాళ్ల‌ని పూర్తిగా త‌న వైపున‌కు తిప్పుకొని.. రాష్ట్రం ప‌ట్ల జాలి ప‌డేలా కూడా చేస్తారు.

బాబు మాట‌లు.. నిజ‌మేన‌ని అంద‌రూ అనుకుంటారు. దీనికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఓ కార‌ణమేన‌ని అంటారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. బాబు గారి ఖ‌ర్చులు చూస్తే.. మాత్రం ఆయ‌న దేనికీ త‌గ్గ‌ట్లేదు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఎంత త‌న సొంత ఖ‌ర్చు పెట్టించుకోవాలో.. అంతా పెట్టించుకుంటున్నారు. దీనికి ఆయ‌న క్యాంపు ఆఫీస్‌ల సంఖ్యే ఉందాహ‌ర‌ణ‌. తాజాగా జూబ్లిహిల్స్ లో ఆయన నిర్మించుకున్న ఇంటిని కూడా క్యాంప్ ఆపీస్ గా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే, ఇప్పటికే హైదరాబాద్ లోని లేక్ వ్యూ అతిథి గృహాన్ని, మదీనాగూడ ఫామ్ హౌస్ ను క్యాంప్ ఆఫీస్ లుగా గుర్తించింది. వాటికి అయ్యే ఖ‌ర్చును ఏపీ ప్ర‌భుత్వ ఖాతా నుంచే చెల్లిస్తున్నారు. ఇప్పుడు తాజాగా జూబ్లిహిల్స్ ఇంటికి కూడా ఆ హోదా కల్పించింది. దీంతో అక్కడ అయ్యే ఖర్చులు చాలావరకు ప్రభుత్వం భరించవలసి ఉంటుంది. కాగా విజయవాడలో కృష్ణ కరకట్ట ఇంటిలో చంద్రబాబు నివసిస్తున్నారు.

ఆ ఇంటిని, విజయవాడలోని అతిధి గృహాన్ని కూడా క్యాంప్ ఆఫీస్ లు గా ప్రకటించారు.అలాగే నారావారిపల్లె లోని ఇంటికి సీసీ టీవీలు ఏర్పాటు చేయడానికి 36 లక్షల రూపాయల మొత్తం కూడా మంజూరు చేశారు. మ‌రి రాష్ట్రం తీవ్ర ఆర్థిక క‌ష్టాల్లో ఉంద‌నే చంద్ర‌బాబు.. ఇలా ఇష్టానుసారంగా ఖ‌ర్చు చేస్తుండ‌డం పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు జోరందుకున్నాయి. మ‌రి వీటిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!