టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ మొద‌లైందా..!

తెలుగు రాష్ట్రాల్లో క్ర‌మ శిక్ష‌ణ ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది నిజంగా టీడీపీనే! అన్న‌గారి హ‌యాం నుంచి పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెద్ద పీట వేస్తున్నారు. ఏదైనా విభేదాలు ఉంటే సామ‌ర‌స్య పూర్వ‌కంగా అధినేత దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించుకోవ‌డం, ఏవైనా ఇబ్బందులున్నా.. అలాగే ప‌రిష్క‌రించుకోవ‌డం పార్టీ ఆన‌వాయితీ. ఇక‌, పార్టీ అభివృద్ధికి సంబంధించిన విష‌యాల‌పై అయితే, మ‌హానాడు వేదిక ఎలాగూ ఉంది. అంతేత‌ప్ప ఇత‌ర పార్టీల్లో మాదిరిగా ముఖ్యంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాదిరిగా.. ఎలా బ‌డితే అలా నేత‌లు వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం లేదు. ఇది అన్న నంద‌మూరి రామారావు నుంచి అమ‌ల‌వుతున్న మంచి ప‌రిణామం.

అయితే, ఇటీవ‌ల కాలంలో పార్టీ లో క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నేత‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చి త‌న్నుకోవ‌డం, త‌మ మాటే నెగ్గాల‌నే ఆధిప‌త్య ధోర‌ణిని పెంచుకోవ‌డం, కౌన్సిల్ మీటింగ్‌ల్లో వ‌ర్గాలుగా ఏర్ప‌డి కొట్టుకోవ‌డం మ‌న‌కు తెలిసిందే. దీనికి క‌ర‌ణం, గొట్టిపాటి వ‌ర్గాల గొడ‌వ నుంచి భూమా, శిల్పాల గొడ‌వ‌ల వ‌ర‌కు ఎన్నో ఉన్నాయి. అయితే, వీటికి చెక్ పెట్ట‌డంలో అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌రకు ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ కూడా ఉంది. అయితే, ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు హెచ్చ‌రిస్తూనే ఉన్నారు. క్ర‌మ శిక్ష‌ణ‌కు టీడీపీ పెద్ద పీట వేస్తుంద‌ని, క్ర‌మ శిక్ష‌ణ త‌ప్పితే.. ఎంత‌టి వారైనా ఉపేక్షించేది లేద‌ని క‌ర‌ణంను ఉద్దేశించి హెచ్చ‌రించారు కూడా.

ఇక‌, ఇప్పుడు ఈ దిశ‌గానే చ‌ర్య‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇటీవ‌ల అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన వాకాటి పాండురంగారావుని పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ భూ కుంభ‌కోణంలో అరెస్ట‌యిన దీప‌క్ రెడ్డిని కూడా పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డం ద్వారా క్ర‌మ శిక్ష‌ణ కొర‌డా ఝళిపించారు చంద్ర‌బాబు. అదేస‌మ‌యంలో రాష్ట్ర‌లో హాట్ టాపిక్‌గా మారిన మంత్రులు అయ్య‌న్న‌, గంటాల ర‌గ‌డ విష‌యంలోనూ ఇదే విధంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం లేక‌పోలేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదే విష‌యాన్ని ప‌రోక్షంగా హెచ్చ‌రించారు మ‌రో మంత్రి, టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు. నేత‌లు గొడ‌వ‌లు ప‌డి.. పార్టీ ప‌రువును బ‌జారుకు ఈ డిస్తే.. చూస్తూ.. కూర్చునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఎంత‌టి వారైనా క్ర‌మ‌శిక్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని అన్నారు. ఈ విష‌యంలో రాజీ ప‌డ‌బోమ‌ని ప‌రోక్షంగా ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు హెచ్చ‌రించారు. సో.. మ‌ళ్లీ.. టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ మొద‌లైంద‌నే అనుకోవాలి!!