ఇదంతా అఖిల ప్రియ నిర్వాక‌మేన‌ని టీడీపీ నేత‌లు గుర్రు

ప‌ద‌విని చేప‌ట్టి ఏడాదైనా పూర్తికాకుండానే ప‌ర్యాట‌క శాఖా మంత్రి భూమా అఖిల ప్రియ.. తీవ్ర అసంతృప్తిని మూట‌గ‌ట్టుకున్నారా? ఆమెకు జై కొట్టిన నేత‌లు, నోళ్లే.. ఇప్పుడు ఆమెను విమ‌ర్శిస్తున్నారా? సొంత జిల్లా క‌ర్నూలు టీడీపీలోనే మంత్రి గారి వ్య‌వ‌హార శైలిపై నేత‌లు నొచ్చుకుంటున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. యువ మ‌హిళా మంత్రిగా బాబు కేబినెట్‌లో సీటు పొందిన భూమా కుమార్తెకు స్టార్టింగ్‌లో సొంత జిల్లాలో నేత‌లు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు.

అయితే, భూమా నాగిరెడ్డి ఆకస్మిక మ‌ర‌ణంతో ఖాళీ అయిన నంద్యాల సీటుకి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి అభ్య‌ర్థుల ఎంపిక‌పై చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు ప్రారంభించేలోగానే.. క‌ర్నూలు జిల్లాల్లో ఈ సీటుపై పెద్ద క‌ల‌క‌లం రేగింది. ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు శిల్పా బ్ర‌ద‌ర్స్ నుంచి గ‌ట్టి పోటీ వ‌చ్చింది. అయితే, త‌న తండ్రి సీటును త‌న కుటుంబానికే కేటాయించాల‌ని మంత్రి అఖిల ప్రియ పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఈ విష‌యంలో ఆమె దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన తీరు టీడీపీని ఇప్పుడు న‌వ్వుల పాలు చేసింద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

భూమా సీటు త‌మ‌కేన‌ని, త‌మ కుటుంబ స‌భ్యులే పోటీ చేస్తార‌ని మంత్రి నేరుగా మీడియా మీటింగుల్లోను, బ‌హిరంగంగానూ ప్ర‌క‌టించేసింది. దీంతో శిల్పా మోహ‌న్ రెడ్డి త‌న‌కు సీటు రాద‌ని గ్ర‌హించి జ‌గ‌న్ పంచ‌న చేరిపోయారు. ఆయ‌న వెళ్తూ వెళ్తూ.. జిల్లాలోని కీల‌క టీడీపీ నేత‌లను వైసీపీలోకి తీసుకుపోయాడు. దీంతో ఇప్పుడు క‌ర్నూలులో టీడీపీ బాగా బ‌ల‌హీన ప‌డింది. ఇదంతా మంత్రి అఖిల ప్రియ నిర్వాక‌మేన‌ని టీడీపీ క‌ర్నూలు నేత‌లు గుర్రుగా ఉన్నారు. మ‌రి ఈ కోపం ఏ రకంగా దారి తీస్తుందో చూడాలి.