తెలంగాణ‌లో బాబు దుకాణం బంద్!

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. ప‌రిస్థితి మ‌రో తెలుగు రాష్ట్రం తెలంగాణంలో మాత్రం అగ‌మ్య‌గోచ‌రంగా మారింది! జాతీయ పార్టీగా అవ‌త‌రించి.. నేష‌న‌ల్ లెవ‌ల్ లో చ‌క్రం తిప్పాల‌ని చంద్ర‌బాబు భావించారు. అయితే, అనూహ్యంగా ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ప‌క్క‌రాష్ట్రం అందునా హైద‌రాబాద్‌ను నేనే డెవ‌లప్ చేశాన‌ని ప‌దేప‌దే చెప్పుకొనే బాబుకి ఇప్పుడు ఆ రాష్ట్రంలో పార్టీని నిలుపుకొనే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదంటున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు. విష‌యం లోకి వెళ్తే..

తెలంగాణలో టీడీపీ మెల్లగా కనుమరుగు కావడం మొదలయ్యింది. టీడీపీ తరుపున గెలిచినా ఎమ్మెల్యేలు అందరు అధికార టీఆర్ ఎస్‌ కండువా కప్పేసుకున్నారు. దీంతో ఎన్నో ఏళ్ళుగా పార్టీలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు అందరు పోయారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికి పార్టీని నమ్ముకొని ఉన్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ వుంటే తెలంగాణలో టీడీపీ బ్రతికి బట్టకట్టడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే బీజేపీ తెలంగాణలో బలపడేందుకు సిద్ధమవుతుంది.

మ‌రోప‌క్క ఇప్పటికీ తెలంగాణలో ప్రాంతీయ వాదం బలంగా వుంది. ఇలాంటి పరిస్థితిలో తెలుగు దేశాన్ని మరల అధికారంలోకి తీసుకురావాలని జనం ఆలోచించే ప్రసక్తే లేదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అలాగే టీఆర్ ఎస్ నేత‌లు కూడా టీడీపీని విమర్శిస్తున్న ప్రతి సారీ.. తెలంగాణలో సైకిల్ పార్టీ చెత్త కుప్పలోకి వెళ్ళిపోయిందని అంటున్నారు. మరో వైపు గద్దర్, కోదండరాం వంటి నాయకులు పొలిటికల్ ఫ్రేమ్ లోకి వచ్చారు. ఈ నేపధ్యంలో టీడీపీ భవిష్యత్తు తెలంగాణలో ఇక శూన్యమే అనే మాట వినిపిస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా బాబు.. పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి పెడ‌తారో.. ఏపీ చాల్లే అని స‌ర్దుకుంటారో చూడాలి!!