మోడీ ముందు చేతులెత్తేసిన బాబు-జ‌గ‌న్‌

ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని న‌మ్మించి మోసం చేసిన కేంద్రాన్నిఇరుకున‌పెట్టే అవ‌కాశాన్ని అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ చేజార్చుకున్నాయి. హోదాతో వ‌చ్చేది లేద‌ని, అందులో ఉన్న‌వ‌న్నీ ప్యాకేజీలో ఉన్నాయ‌ని చెబుతున్న టీడీపీ.. హోదా కోసం రెండేళ్లుగా పోరాడుతున్నామ‌ని మ‌భ్య‌పెడుతున్న వైసీపీ.. త‌మ‌కు ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ నాల కంటే త‌మ సొంత ప్రయోజ‌నాలే ముఖ్య‌మ‌ని మ‌రోసారి రుజువుచేశాయి. కేంద్రం ఏం చెప్పినా, ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. జీహుజూర్ అంటూ త‌లాడిస్తున్న ఆ పార్టీలు.. బీజేపీ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి త‌మ‌ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఈ స‌మ‌యంలోనైనా ప్ర‌త్యేక‌హోదా అంశాన్ని కేంద్రం ముందుంచే క‌నీస ప్ర‌య‌త్నం చేయ‌కుండా స‌రెండ‌ర్ అయిపోయాయి.

రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎవ‌రా అని ఎంతో కాలం నుంచీ ఎదురుచూస్తున్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోడీ, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ఊహించ‌ని షాక్ ఇచ్చారు. ఒక ద‌ళిత అభ్య‌ర్థిని అనూహ్యంగా తెర‌మీదికి తీసుకొచ్చారు. త‌మ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు ప్ర‌ధాని మోడీ.. ఏపీ సీఎం చంద్ర‌బాబుతో మాట్లాడారు. ప్ర‌తిప‌క్ష‌ జ‌గ‌న్‌ను సంప్ర‌దించారు. ఇద్ద‌రూ ఇద్ద‌రూ ఇక మరో మాట‌లేకుండా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుగానీ, జ‌గన్ గానీ ప్ర‌ధాని మోడీకి పూర్తిగా స‌రెండ‌ర్‌ అయిపోయార‌నే అభిప్రాయం సర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు కావాల‌ని ప్ర‌ధాని వీరిని కోరిన‌ప్పుడు… ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి కూడా ఆలోచిస్తే.. బాగుండేద‌ని విశ్లేషకులు చెబుతున్నారు.

అటు చంద్ర‌బాబు, ఇటు జ‌గ‌న్‌.. ఢిల్లీ వెళ్లి హోదా గురించి ప్ర‌ధాని మోడీతో చ‌ర్చించిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. వాట‌న్నింటినీ సాంతంగా విని.. చివ‌ర‌కు హోదా ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టంచేశారు. ఇప్పుడు ప్ర‌ధానే నేరుగా ఫోన్ చేసి.. తమ అభ్య‌ర్థికి మ‌ద్దతు ఇవ్వాలని కోరితే.. ఏపీ ప్ర‌యోజ‌నాలు, ప్ర‌జ‌ల గురించి ఏమాత్రం ఆలోచించలేద‌ని విశ్లేష‌కులు వాపోతున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాకు రాష్ట్రప‌తి ఎన్నిక‌ మ‌ద్ద‌తుకూ లింక్ పెట్టి ఉంటే బాగుండేదని, అప్పుడు కేంద్రం క‌చ్చితంగా హోదాపై సానుకూలంగా స్పందించేదని చెబుతున్నారు. ఈ అవ‌కాశాన్ని ఇద్ద‌రూ జార‌విడిచార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

సంఖ్యాప‌రంగా చూసుకున్నా ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో ఎక్కువ‌గా ఉన్నారు. అయినా వీటి గురించి ఆలోచించిన దాఖలాలే లేవు. ప్ర‌త్యేక హోదా అనేది కేవ‌లం ఒక రాజ‌కీయాంశం మాత్ర‌మేన‌ని, దానితో ముడిప‌డి ఉన్న ఆంధ్రా ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ప‌ట్ట‌వనే విష‌యం రుజువైంది! ప‌ట్టి ఉంటే ఈ సంద‌ర్భంలో కేంద్రంపై ప‌ట్టు బిగించేవారు. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలే ప్రధానం అనుకుని ఉంటే అధికార ప్ర‌తిప‌క్షాలు ఒక‌టై కేంద్రాన్ని నిల‌దీయవచ్చు. కానీ అటువంటి ప‌రిస్థితి ఊహించుకోవ‌డ‌మే అన‌వ‌స‌రం! ఏది ఏమ‌యినా.. ప్ర‌ధాని మోడీ వ‌ద్ద‌ హోదా అంశం రాకుండా అటు చంద్ర‌బాబు, ఇటు జ‌గ‌న్ చాలా జాగ్ర‌త్త‌ప‌డ్డారు!