బీజేపీలో కేశినేని మంట‌

ఏపీలో అధికార ప‌క్షంలో ఉన్న టీడీపీ, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ మ‌ధ్య మాట‌ల మంట రేగుతోంది. గ‌త మూడేళ్లుగా ఈ రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా బీజేపీతో పొత్తు వల్లే మెజారిటీ తగ్గిందంటున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్య‌లు రెండు పార్టీల మ‌ధ్య మ‌రింత‌గా మంట రేపుతున్నాయి.

తాజాగా ఎంపీ కేశినేని వ్యాఖ్య‌ల‌పై బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష‌నేత‌, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తీవ్రంగా స్పందించారు. బీజేపీతో పొత్తు వ‌ల్లే త‌న‌కు మెజార్టీ త‌గ్గిందంటోన్న నాని ఇప్పుడు త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి తిరిగి గెల‌వాల‌ని స‌వాల్ విసిరారు. ప్ర‌స్తుతం నాని ఉన్న ప్లేస్లో తానుంటే తాను ఖ‌చ్చితంగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేవాడిన‌ని ఆయ‌న అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ కీల‌కపాత్ర పోషిస్తోంద‌న్నారు.

ఇక ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను కూడా విష్ణుకుమార్ రాజు టార్గెట్ చేశారు. ప్ర‌త్యేక హోదాకు మించిన ప్యాకేజీ తాము ఇచ్చినా ప‌వ‌న్ మాత్రం ఇంకా హోదా అంశాన్నే ప‌ట్టుకుని వేలాడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌మకు ప‌వ‌న్ చేసిన సేవ‌ల‌ను తాము గుర్తుంచుకుంటామ‌ని…. ఏరుదాటాక తెప్ప‌త‌గ‌లేసేలా తాము వ్య‌వ‌హ‌రించ‌మ‌ని ఆయ‌న అన్నారు.

ఏదేమైనా మిత్ర‌ప‌క్షాల‌పై ఆచితూచి మాట్లాడే విష్ణుకుమార్ రాజు సైతం టీడీపీ, ప‌వ‌న్‌ల‌ను టార్గెట్ చేస్తున్నారంటే బీజేపీ టీడీపీ, జ‌న‌సేన‌తో కూడా సై అంటే సై అనేందుకు రెడీగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.