టీడీపీలో కుమ్ములాట‌లు వైసీపీకి ప్లస్

ఏపీలో విప‌క్ష వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పుడు వైసీపీకి బ‌ల‌మైన జిల్లా. ఇక్క‌డ టీడీపీకి గ‌త మూడు ఎన్నిక‌ల్లోను దిమ్మ‌తిరిగే ఫ‌లితాలే వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీ ఇక్క‌డ ఎలాగైనా మెజార్టీ స్థానాలు సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే వైసీపీకి చెందిన ప‌లువురు నేత‌ల‌కు పచ్చ‌కండువా వేస్తోంది.

ఇక్క‌డ పార్టీని బ‌లోపేతం చేసేందుకు మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, ఎంపీ సీఎం ర‌మేశ్‌, స‌తీష్‌రెడ్డి, బీటెక్ రవి లాంటి వాళ్లు ఎంత క‌ష్ట‌ప‌డుతోన్నా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపుల గోల మాత్రం స‌మ‌సిపోవ‌డం లేదు. జిల్లాలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీలో ఎవడిగోల వాడిదే అన్న‌ట్టుగా ఉంది. జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి వ‌ర్సెస్ ఆదినారాయ‌ణ‌రెడ్డి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తేనే భ‌గ్గుమ‌నేలా ఉంది.

నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి మ‌ధ్య వ్య‌వ‌హారం మ‌రింత‌గా ముద‌ర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వీరిద్ద‌రిలో జ‌మ్మ‌ల‌మ‌డుగు టిక్కెట్ ఎవ‌రికి ఇచ్చినా మ‌రొక‌రు వైసీపీ త‌ర‌పున పోటీ చేయ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. వచ్చేఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మడుగు టిక్కెట్ ఆదికే దాదాపుగా ఖ‌రారు కావ‌డంతో రామసుబ్బారెడ్డి వైసీపీలోకి రాక‌పోరా ? అని జ‌గ‌న్ సైతం వెయిట్ చేస్తున్నారు.

బద్వేల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు, టీడీపీ ఇన్‌ఛార్జ్‌ విజయజ్యోతి టికెట్ ఆశిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడ్ కావడంతో మాజీ మంత్రి వీరారెడ్డి కూతురు విజయమ్మకు అవకాశంలేదు. ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య విబేధాలు టీడీపీకి పెద్ద మైన‌స్‌గా మారాయి.

ఇక జిల్లా కేంద్ర‌మైన క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గంలో ఏకంగా ఆరుగురు నేతలు ఇక్కడ టికెట్ రేసులో ఉన్నారు. పోయిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దుర్గా ప్రసాద్ బలంగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వైసీపీ బ‌లంగా ఉన్న రాయ‌చోటిలో మాజీ ఎమ్మెల్యేలు ర‌మేష్‌రెడ్డి, పాలకొండ్రాయుడులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు.

రైల్వేకోడూరులో ఇటీవ‌ల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన చెంగ‌ల్రాయుడుకు, పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ విశ్వ‌నాథ‌నాయుడికి అస్స‌లు పొస‌గ‌డం లేదు. పులివెందుల‌లో పార్టీ వీక్‌గా ఉన్నా స‌తీష్‌రెడ్డి వ‌ర్సెస్ రాంగోపాల్‌రెడ్డి మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. వీరిద్ద‌రూ టిక్కెట్ రేసులో ఉన్నారు.

కమలాపురంలో వీరశివారెడ్డి, పుత్తనరసింహారెడ్డి మధ్య తీవ్రమైన విబేదాలున్నాయి. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా… రెండో వ్యక్తి దెబ్బతీస్తాడు. ఇదే జ‌గ‌న్ మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డికి చాలా ప్ల‌స్ కానుంది. ఏదేమైనా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గ‌క‌పోతే ఇక్క‌డ టీడీపీలో కుమ్ములాట‌లు వైసీపీకి ప్లస్ కావ‌డం ఖాయం.