క‌ల‌క‌లం: వైసీపీలోకి కేశినేని నాని..!

ఈ వార్త‌లో నిజానిజాలు ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే విజ‌య‌వాడ‌లోని ఓ వ‌ర్గం నాయ‌కులు మాత్రం ఇదే ప్ర‌చారం హోరెత్తించేస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీ చేప‌ట్టిన ఆక‌ర్ష్ దెబ్బ‌కు విప‌క్ష వైసీపీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఒక‌రిద్ద‌రు ఎంపీలు సైకిలెక్కేశారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన కొత్త నాయ‌కులు, పాత నాయ‌కుల మ‌ధ్య పొస‌గ‌క పోవ‌డంతో పాత టీడీపీ నాయ‌కులు ఇప్పుడు వైసీపీలోకి జంప్ చేస్తున్నారు.

తాజాగా క‌ర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో టీడీపీ నాయ‌కులు రివ‌ర్స్ గేర్‌లో వైసీపీలోకి జంప్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా భూమా స‌న్నిహితుడైన సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త ఏవీ.సుబ్బారెడ్డి సైతం త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ తాను వైసీపీలోకి వెళ్లిపోతాన‌ని వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు కృష్ణా రాజ‌కీయాల్లో భారీగా క‌ల‌క‌లం రేపే వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కొద్ది రోజులుగా టీడీపీలో వేగ‌లేక‌పోతూ, చంద్ర‌బాబు, పార్టీని, ప్ర‌భుత్వాన్ని టార్గెట్‌గా చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తోన్న విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని సైతం వైసీపీలోకి వెళ్లిపోతారంటూ బెజ‌వాడ‌లో ఓ వ‌ర్గం నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. ర‌వాణా శాఖ‌లో జ‌రిగిన ఇష్యూ త‌ర్వాత నాని త‌న కేశినేని ట్రావెల్స్‌ను మూసివేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అప్ప‌టి నుంచి ఆయ‌న ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప‌దే ప‌దే వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఒక‌టి రెండుసార్లు వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. తాజాగా విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి లోకేశ్ సైతం నానికి ఫోన్ చేసి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బ‌హిరంగంగా మాట్లాడ‌వ‌ద్ద‌ని ఏదైనా ఉంటే తాను వ‌చ్చాక మాట్లాడుకుందామ‌ని చెప్పినా నాని మాత్రం త‌న తీరు మార్చుకోలేదు. ఈ విష‌యంలో నాని ప్ర‌భుత్వంతో తాడో పేడో తేల్చుకునేట‌ట్టుగానే వ్య‌వ‌హారం క‌నిపిస్తోంది.

అనుమానాల‌కు లెక్కే లేదు :

ఇక నాని అసంతృప్తికి మ‌రో కార‌ణం కూడా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీ సీటును బీజేపీ కోరుతుంద‌ని తెలుస్తోంది. ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి లైన్లో ఉన్నారు. ఇక చంద్ర‌బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి పేరు సైతం టీడీపీ నుంచి వినిపిస్తోంది. ఇక కేంద్ర మంత్రి వెంక‌య్య త‌న కుమార్తె దీపాను ఇక్క‌డ నుంచి ఎంపీగా పోటీ చేయించాల‌ని ప్లాన్లు వేస్తున్నార‌ట‌. ఇన్ని అంశాల మ‌ధ్య కేశినేని నానికి మ‌రోసారి ఇక్క‌డ సీటు రావ‌డం అనుమానంగానే ఉంది. ఈ నేప‌థ్యంలో నాని రాజ‌కీయంగా కొత్త స్టెప్ తీసుకోబోతున్నారంటూ..అందుకే ఆయ‌న పార్టీపై ధిక్కార స్వ‌రం వినిపిస్తున్నారంటూ బెజ‌వాడ‌లో హాట్ హాట్‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది.