పోటీపై కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన బాలయ్య

కొద్ది రోజులుగా ఏపీ పాలిటిక్స్‌లో ఓ ఇష్యూపై తెగ చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌ముఖ సినీన‌టుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గం మారుతున్నార‌న్న‌దే ఆ వార్త. బాల‌య్య‌కు హిందూపురంలో ఇటీవ‌ల బాగా వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని, ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో హిందూపురంకు బ‌దులుగా కృష్ణా జిల్లాలోని గుడివాడ లేదా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారని మీడియాలోను, సోష‌ల్ మీడియాలోను వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌కు బాల‌య్య ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేశాడు.

ఆదివారం త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన హిందూపురంలో ప‌ర్య‌టించిన బాల‌య్య తాను నియోజ‌క‌వ‌ర్గం మారుతున్న‌ట్టు వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని కొట్టిప‌డేశారు. ఇక త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన గుడివాడ నుంచి పోటీ చేయాల‌ని కార్య‌క‌ర్త‌లు ఒత్తిడి చేస్తున్నా తాను మాత్రం హిందూపురం నుంచే పోటీ చేస్తాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.

ఇక త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రూపు రాజ‌కీయాల‌పై కూడా బాల‌య్య స్పందించారు. గ్రూపు రాజకీయాలకు భయపడేది లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. హిందూపురంలో ఎవరెన్ని గ్రూపు రాజకీయాలకు పాల్పడినా భయపడేది లేదని, కార్యకర్తలు తనకు కొండంత అండగా ఉంటారని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు.

అలాగే హిందూపురం నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం తాను మంత్రుల‌తో నిరంత‌రం చ‌ర్చిస్తూనే ఉంటాన‌ని చెప్పారు. ఏదేమైనా బాల‌య్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీపై క్లారిటీ ఇచ్చేశాడు.