నాలుగు కొత్త నియోజవర్గాలు … నలుగురు కొత్త ఎమ్మెల్యేలు

ఏపీలో ప‌శ్చిమ‌గోదావ‌రి పేరు చెప్ప‌గానే సంచ‌ల‌న రాజ‌కీయాల‌కు కేంద్ర‌బిందువుగా నిలుస్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని అన్ని సీట్ల‌లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లు (తాడేప‌ల్లిగూడెంలో మిత్ర‌ప‌క్షం బీజేపీ)తో క‌లుపుకుని మూడు ఎంపీ స్థానాలు టీడీపీకే ద‌క్కాయి. రాజ‌కీయంగా జిల్లా ప్ర‌జ‌లు ఎంతో చైత‌న్య‌వంతంగా ఉంటారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జిల్లాలో నాలుగు కొత్త అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెరుగుతున్నాయ‌న్న అంచ‌నాల‌తో ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఆశిస్తోన్న ఆశావాహులు లిస్టు రోజు రోజుకు పెరుగుతోంది.

జిల్లాలో ప్ర‌స్తుతం ఉన్న 15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు తోడుగా కొత్త‌గా మ‌రో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు ఏర్ప‌డ‌తాయ‌ని తెలుస్తోంది. ఈ కొత్త నియోజ‌క‌వ‌ర్గాల్లో మెట్ట ప్రాంతంలో రెండు, డెల్టాలో మ‌రో రెండు వ‌స్తాయ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. మెట్ట‌లో జిల్లాలో కొత్త‌గా క‌లిసిన కుక్కునూరు, వేలేరుపాడు మండ‌లాల‌తో పాటు జీలుగుమిల్లిని క‌లుపుకుని చింత‌ల‌పూడి కేంద్రంగా కొత్త‌గా ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం రానుంది.

ఇక మెట్ట‌లోనే జంగారెడ్డిగూడెం కేంద్రంగా మ‌రో జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజ‌న‌ల్ కేంద్రం కావ‌డంతో జంగారెడ్డిగూడెం కేంద్రంగా కొత్త సెగ్మెంట్ రానుంది. ఇక డెల్టాలో గ‌తంలో ర‌ద్ద‌యిన పెనుగొండ‌, అత్తిలిలో ఓ నియోజ‌క‌వ‌ర్గం తిరిగి ఏర్ప‌డ‌డం ఖాయం. ఇక భీమ‌వ‌రం రూర‌ల్ కేంద్రంగా మ‌రో నియోజ‌క‌వ‌ర్గం వ‌స్తుంద‌ని ప్రాథ‌మిక అంచ‌నాల ద్వారా తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే కొత్త‌గా ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకుంటోన్న ఆశావాహులు డీ లిమిటేష‌న్‌పై చాలా ఆశ‌లే పెట్టుకున్నారు. మెట్ట నుంచి ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ సీటు కోసం చాలా మంది లైన్లో ఉండ‌గా, ఇక్క‌డ జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌పున జ‌డ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు ముందు వ‌రుస‌లో ఉన్నారు.

ఇక డెల్టాలో ఏర్ప‌డే రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అవుతుండగా మ‌రొక‌టి జ‌న‌ర‌ల్ కానుంది. ఇక్క‌డ జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌పున మాజీ కేంద్ర మంత్రి బోళ్ల రాజీవ్‌, ముళ్ల‌పూడి రేణుక‌, బీసీ వ‌ర్గాల నుంచి ప‌లువురు లైన్లో ఉన్నారు. అత్తిలి లేదా పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గం జ‌న‌ర‌ల్ అయితే వీళ్ల‌కు ప్రాధాన్యం ఉంటుంది. అదే భీమ‌వ‌రం రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం జ‌న‌ర‌ల్‌గా ఏర్ప‌డితే అక్క‌డ నుంచి గాదిరాజు బాబు, మెంటే పార్థ‌సార‌థి లాంటి వాళ్లు టీడీపీ నుంచి రేసులో ఉంటారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ లెక్క‌లు ఎలా మార‌తాయో చూడాలి. ఇక ప్ర‌తిప‌క్ష వైసీపీలో మాత్రం ఇంకా ఎలాంటి పేర్లు తెర‌మీద‌కు రాలేదు.