టీ కాంగ్రెస్‌లో ఆ ఇద్ద‌రే మొన‌గాళ్ల‌న్న కేసీఆర్ స‌ర్వే

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలకు తీపి కబురు చెప్పారు. కేసీఆర్ ప్ర‌తి మూడు నెల‌ల‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై స‌ర్వేలు చేయిస్తున్నారు. తాజా స‌ర్వేలో ఏం బాంబు పేల్చుతారో అని గుండెలు ప‌ట్టుకుని చూసిన టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఈ స‌ర్వే ఫ‌లితాలు పెద్ద ఉప‌శ‌మ‌నం క‌లిగించాయి. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి కేసీఆర్ ఈ స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డించారు.

ఈ స‌ర్వేలో తెలంగాణ‌లో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే అధికార టీఆర్ఎస్ 119 స్థానాల‌కు 111 స్థానాలు గెలుచుకుని తిరుగులేని విజ‌యం సాధిస్తుంద‌ని తేలింది. మిగిలిన 8 స్థానాల్లో ఎంఐఎం త‌మ సిట్టింగ్ సీటు మ‌ల‌క్‌పేట కోల్పోయి 6 స్థానాల‌కు ప‌రిమిత‌మైతే టీడీపీ, సీపీఐ, సీపీఎం మిగిలిన పార్టీలు జీరో కానున్నాయి. ఇక టీఆర్ఎస్‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ కేవ‌లం రెండు సీట్ల‌కే ప‌రిమితం కానుంది.

కేసీఆర్ స‌ర్వేలో ఓ ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్ర‌మే గెలుస్తార‌ని తేలింది. జానాలు, ఉత్త‌మ్‌లు, కోమ‌టిరెడ్డిలు, అరుణ‌లు, జీవ‌న్‌రెడ్డిలు ఇలా త‌ల‌పండిన కాంగ్రెస్ సీనియ‌ర్లంద‌రూ ఓడిపోతార‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. క‌ల్వ‌కుర్తి ఎమ్మెల్యే వంశీచంద‌ర్‌రెడ్డి, మ‌ధిర ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క మాత్ర‌మే మ‌రోసారి గెలుస్తార‌ట‌. కాంగ్రెస్‌లో త‌ల‌పండిన సీనియ‌ర్లు సైతం ఓడిపోయి వీరిద్ద‌రు గెలుస్తార‌ని కేసీఆర్ స‌ర్వే చెప్పిందంటే వీరుద్ద‌రు నిజ‌మైన హీరోలే అన్న చ‌ర్చ‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో వినిపిస్తున్నాయి.

ఇక ఎమ్మెల్యేల ప‌రంగా మార్కులు చూసుకుంటే కేసీఆర్‌ టాప్‌లో ఉన్నారు. గ‌జ్వేల్‌లో ఆయ‌న 98 శాతంతో ప్రజామోదం పొందారు. ఆ తర్వాతి స్థానంలో సీఎం కొడుకు కేటీఆర్‌ 91 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. మరో కీలక నేత హరీష్ రావు 88 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధ‌వరం కృష్ణారావు 36 శాతంతో ఈ సర్వేలో ఆఖరి స్థానంలో నిలిచారు.