త‌మిళ‌నాట బీజేపీ ఆట షురూ?! 

`త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. అన్నాడీఎంకే అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో అస్స‌లు కేంద్రం వేలు పెట్ట‌దు. త‌మిళ‌నాట జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు కేంద్రానికీ ఎటువంటి సంబంధం లేదు` ఇదీ కొంత‌కాలంగా బీజేపీ పెద్ద‌లు, కేంద్ర మంత్రులు ప‌దే ప‌దే చెబుతున్న మాట‌. కానీ ఆ మాట‌ల‌న్నీ నీటి మూట‌లేన‌ని తేలిపోయింది. ఏకంగా స‌చివాల‌యంలోనే కేంద్ర‌మంత్రి.. రాష్ట్ర మంత్రులతో స‌మావేశ‌మ‌య్యే స్థాయిలో ఉన్నారంటే.. త‌మిళ‌నాట ప‌రిస్థితుల‌ను కేంద్రం ఎంత‌వ‌ర‌కూ త‌న చెప్పు చేత‌ల్లో పెట్టుకుంటే అర్థ‌మ‌వుతోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. `అమ్మ` ఉంటే ఇటువంటి దుస్సాహ‌సానికి పాల్ప‌డి ఉండేవారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

రాష్ట్ర పరిపాలనకు ప్రధాన స్థానమైన సచివాలయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశం వివాదాస్ప‌దంగా మారింది. మెట్రో సొరంగ మార్గ రైలు ప్రారంభోత్సవంలో ఆయ‌న పాల్గొన్నారు. అన్నానగర్‌లో అన్నాడీఎంకే పతాకాలకు పోటీగా బీజేపీ జెండాలను ఎగురవేసి రెండు పార్టీలు మిత్రపక్షం అనే ధోరణిని ప్రదర్శించాయి. అనంత‌రం చెన్నై సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించడం ప్రముఖంగా చర్చనీయాంశమైంది. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహవసతి, దారిద్య్ర నిర్మూలన, సమాచార, ప్రసార శాఖలు రాష్ట్రంలో అమలు జరుగుతున్న తీరుపై అధికారులతో సమావేశం అయ్యారు.

ఒక కేంద్ర మంత్రి సచివాలయంలో సమావేశమైన ఘటన రాష్ట్ర చరిత్రలో లేదని వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. జయలలిత జీవించి ఉన్నంత వరకు బీజేపీ ప్రభుత్వం ఇటువంటి సాహసానికి ఒడిగట్టలేదు. జయ హయాంలో కేంద్రమంత్రులు చెన్నైకి వచ్చేదీ పోయేదీ కూడా తెలియదు అన్నట్లుగా వ్యవహరించేవారు. జయ మరణంతో గతంలోని పరిస్థితి తలకిందులుగా మారింది. అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడంతో కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తూ ప్రభుత్వాన్ని నెట్టుకురావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సమావేశాన్ని నిర్వహించి సీఎం ఎడపాడిపలనిస్వామితో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించడాన్ని ఆక్షేపిస్తున్నారు.

సీఎంగా జయలలిత ఉంటే ఇలా జరిగేదా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో మెట్రోరైలు తొలిదశ ప్రారంభంలో జయ ఒకచోట వెంకయ్యనాయుడు మరోచోట ఉండడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారనేందుకు నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న తరహాలో రాష్ట్రంపై పెత్తనానికి సమాయత్తమైందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.