లోకేష్ `ఐటీ`లో పాస‌య్యే బాధ్యత చంద్ర‌బాబుదే

ఏపీలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైటెక్ బాబుగా పేరు తెచ్చుకున్నారు చంద్ర‌బాబు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌.. ఐటీ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం.. పెద్ద ఎత్తున కంపెనీలు, ఉద్యోగాలు తీసుకొస్తాన‌ని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఐటీ రంగం సంక్షోభం ఎదుర్కొంటోంది. సంక్షోభాల నుంచి అవ‌కాశాలు సృష్టించుకోవాల‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతుంటారు. ఇప్పుడు ఏపీలో శ‌ర‌వేగంగా ఐటీ కంపెనీల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తే భ‌విష్య‌త్ బాగుంటుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మరి ఈ అవ‌కాశాన్ని లోకేష్ స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రా? అని సందేహం వ్య‌క్తంచేస్తున్నారు.

భార‌తీయ ఐటీ రంగం మ‌రోసారి సంక్షోభం దిశ‌గా అడుగులేస్తోంద‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐటీ సంస్థ‌లు స్థానిక‌త‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల్సి వ‌స్తోంది. దాంతోపాటు మారుతున్న టెక్నాల‌జీస్ ను కూడా అంది పుచ్చుకో వాల్సిన త‌రుణ‌మిది. వరుస‌గా దిగ్గ‌జ కంపెనీలు ఉద్యోగుల కోత మొద‌లుపెట్టాయి. మ‌రికొన్ని ప్ర‌ముఖ సంస్థ‌లు కూడా ఇదే బాట‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే, సంక్షోభ స‌మ‌యాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ అవ‌కాశంగా మార్చుకోగ‌లుగు తారా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే రెండేళ్ల‌లో ల‌క్ష‌కుపైగా ఐటీ ఉద్యోగాలు తీసుకొస్తామ‌ని ఈ మ‌ధ్య లోకేష్ చెబుతున్నారు. విజ‌య‌వాడ‌లో వ‌రుస‌పెట్టి ఐటీ కంపెనీల‌ను ఇటీవ‌ల ప్రారంభించారు.

రాష్ట్రానికి రాబోతున్న సంస్థ‌ల‌కు వీలైనంత త్వ‌రిత‌గ‌తిన మౌలిక స‌దుపాయాలు ఏర్పాటు చేయాల‌న్న ఉద్దేశంతోనే నారా లోకేష్ భూకేటాయింపుల క‌మిటీలో చేరిన‌ట్టు టీడీపీ సమ‌ర్థించుకుంది. ఇంకోప‌క్క‌.. సీఎం చంద్ర‌బాబు కూడా అమెరికాలో ప‌ర్య‌టించి పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరుతున్నారు. రాబోయే ద‌శాబ్దంన్న‌ర‌పాటు ఏపీ వృద్ధి రేటు 12 నుంచి 15 ఉంటుంద‌నీ, కాబ‌ట్టి ఏపీకి పెట్టుబ‌డుల‌తో రావాలంటూ ఎన్నారైల‌కు ఆహ్వానం ప‌లుకుతున్నారు. నిజానికి, ఇప్పుడు ఐటీ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం తాత్కాలిక‌మే కావొచ్చు. కానీ, దాని ప్ర‌భావం మాత్రం కొన్నేళ్ల‌పాటు ఉంటుంది. ఇత‌ర అనుబంధ‌ రంగాల‌పైనా ఉంటుంది.

ఈ సంక్షోభాన్ని ఏపీ మంత్రి లోకేష్ ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. ఆయ‌న చెబుతున్న‌ట్టు వ‌చ్చే రెండేళ్ల‌లో… అదీ ఇలాంటి సంక్షోభ స‌మ‌యంలో ల‌క్ష ఉద్యోగాలు ఐటీ రంగంలో క‌ల్పించ‌గ‌లిగితే అభినందిచ్చ‌ద‌గ్గ విష‌య‌మే! ఇప్పుడు ఏపీలో ఐటీ అభివృద్ధి ఈ ద‌శ‌లో ప్రారంభమైతే ఆయ‌న మ‌రోసారి హైటెక్ ముఖ్య‌మంత్రి అవుతార‌న‌డంలో సందేహం లేదు. మంత్రిగా నారా లోకేష్ ను పాస్ చేసే అవ‌కాశం ఇది. మ‌రి కొడుకును డిస్టింక్ష‌న్‌లో పాస్ చేసే బాధ్య‌త చంద్ర‌బాబుపైనే ఉంది.