జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా ఆ నియోజకవర్గం లో కులాల కుమ్ములాట

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ అన‌గానే మ‌న‌కు రెడ్డి సామాజిక‌వ‌ర్గం గుర్తుకు వ‌స్తుంది. ఆ పార్టీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఆ పార్టీలో రెడ్ల‌కే ప్ర‌యారిటీ ఉంటుంద‌న్న టాక్ ఉండనే ఉంది. అయితే రెడ్లు ఎక్కువుగా ఉన్న జిల్లాలు మిన‌హాయిస్తే మిగిలిన జిల్లాల్లో జ‌గ‌న్ ఇత‌ర వ‌ర్గాల‌కు కూడా ప్ర‌యారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ చాలా చాలా వీక్‌గా ఉన్న జిల్లాల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఒక‌టి.

ఈ జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అన్ని స్థానాలు క్లీన్‌స్వీప్ చేసేసింది. జిల్లాకు కీల‌క‌మైన మెట్ట ప్రాంతంలో వైసీపీ స్మాష్ అయ్యింది. వైసీపీ త‌ర‌పున స్థానిక సంస్థ‌ల నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసిన వారంద‌రూ ఘోరంగా ప‌రాజ‌యం పాల‌య్యారు. ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన తోట చంద్ర‌శేఖ‌ర్ ఓడిపోయాక ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల‌ను మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు త‌న‌యుడు కోట‌గిరి శ్రీథ‌ర్‌కు అప్ప‌గించారు.

శ్రీథ‌ర్ తండ్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గాన్ని రెండున్న‌ర ద‌శాబ్దాలుగా శాసించారు. వెల‌మ వ‌ర్గానికి చెందిన విద్యాధ‌ర‌రావుకు నియోజ‌క‌వ‌ర్గంలో కుల‌బ‌లం లేక‌పోయినా త‌న స్టామినా చాటారు. చివ‌ర‌కు కోట‌గిరి క‌మ్మ వ‌ర్గానికి చెందిన గంటా ముర‌ళీ చేతిలో అవ‌మాన‌క‌ర రీతిలో ఓడిపోయారు. ప్ర‌స్తుతం శ్రీథ‌ర్ వైసీపీ ఎంట్రీతో చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంతో పాటు జిల్లాలోని మెట్ట ప్రాంతంలోని కొన్ని ఏరియాల్లో వైసీపీలో క‌మ్మ వ‌ర్సెస్ వెల‌మ‌ల మ‌ధ్య కోల్డ్‌వార్ జ‌రుగుతోంది. శ్రీథ‌ర్‌కు తెర‌వెన‌క ఉండి రాజ‌కీయాల‌ను శాసించే కేవీపీ రామ‌చంద్ర‌రావు స‌మీప బంధువు, చింత‌ల‌పూడి ఏఎంసీ మాజీ చైర్మ‌న్ మేడ‌వ‌ర‌పు అశోక్‌బాబు అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి.

శ్రీథ‌ర్‌, అశోక్‌తో పాటు చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న రెడ్లు వీరికి తోడ‌వ్వ‌డంతో వీరు నియోజ‌వ‌క‌ర్గం మీద ఆధిప‌త్యం కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక వైసీపీలో నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు చూస్తోన్న మాజీ ఎమ్మెల్యే గంటా ముర‌ళీకి అశోక్ వ‌ర్గానికి అస్స‌లు పొస‌గ‌డం లేదు. ఇక మెట్ట ప్రాంతంలో గ‌తంలో విద్యాధ‌ర‌రావుతో వైరం ఉండి, ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న క‌మ్మ‌లు సైతం శ్రీథ‌ర్ గెలుపున‌కు ఎంత వ‌ర‌కు స‌హ‌క‌రిస్తార‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలింది.

కొద్ది రోజుల క్రితం చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ బాధ్య‌త‌లు లింగ‌పాలెం మండ‌లానికి చెందిన దెయ్యాల న‌వీన్‌బాబుకు జ‌గ‌న్ ఇచ్చారు. అప్పుడు కూడా గంటా ముర‌ళీ మాట చెల్లుబాటు కాలేదు. వైసీపీ ప‌రంగా నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ‌ల‌కు ప్రాధాన్య‌త త‌గ్గుతూ వ‌స్తోంది. అయితే వీరిని కాద‌ని వెల‌మ వ‌ర్గం ముందుకెళ్లే ప‌రిస్థితి కూడా లేదు.

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే లింగ‌పాలెం, కామ‌ర‌వ‌పుకోట‌, టి.న‌ర‌సాపురం, జంగారెడ్డిగూడెం మండ‌లాల‌తో కొత్త జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డుతుంద‌న్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ టిక్కెట్టు కోసం మాజీ గంటా ముర‌ళీతో పాటు అశోక్ లేదా అశోక్ వ‌ర్గానికి చెందిన నేత‌లు రేసులో ఉంటారు. వీరిలో ఒక‌రికి టిక్కెట్టు ఇస్తే మ‌రొక‌రు స‌హ‌క‌రించుకునే ప‌రిస్థితి లేదు. వీరిద్ద‌రు ఒకే వ‌ర‌లొ ఇమ‌డ‌లేని రెండు క‌త్తుల్లా ఉన్నారు. ఈ ఎఫెక్ట్ ఇటు చింత‌ల‌పూడి సీటుతో పాటు అటు ఏలూరు ఎంపీ బ‌రిలో ఉన్న శ్రీథ‌ర్ గెలుపోట‌ముల‌పై ఖ‌చ్చితంగా ప‌డుతుంది. ఏదేమైనా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంగా వైసీపీలో ఈ రెండు కులాల మ‌ధ్య జ‌రుగుతోన్న వార్ జ‌గ‌న్‌కు పెద్ద చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది.