ఆ మంత్రి డైరెక్ష‌న్‌లో నారా లోకేష్‌..!

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఇటీవ‌లే మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. నారా లోకేశ్‌కు మంత్రి అయ్యేనాటికి రాజ‌కీయ అనుభ‌వం ఎంత అని లెక్క వేసుకుంటే మూడు రోజులే అని చెప్పాలి. లోకేశ్ ఎమ్మెల్సీ అయిన మూడు రోజుల‌కే మంత్రి అయ్యాడు. అది కూడా ఆయ‌న‌కు కీల‌క‌మైన పంచాయ‌తీరాజ్‌, ఐటీ శాఖ‌లు చంద్రబాబు అప్ప‌గించారు. ఇక లోకేశ్‌కు ప్ర‌జ‌ల‌తో అటాచ్‌మెంట్ కూడా లేదు. మ‌రి రాజ‌కీయంగా ఇంత చిన్న ప‌సిగుడ్డు కీల‌క‌మైన శాఖ‌ల మంత్రిగా ఎలా త‌న బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తార‌న్న సందేహాలు చాలానే ఉన్నాయి.

ఇక చంద్ర‌బాబు అప‌ర రాజ‌కీయ మేథావి అన్న విష‌యం తెలిసిందే. త‌న కొడుకు పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ దృష్ట్యా ఇప్ప‌టి నుంచే లోకేశ్‌కు తెర వెన‌క అంతా తానే డైరెక్ష‌న్ ఇస్తూ వ‌స్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల దృష్ట్యా చంద్ర‌బాబు బాగా బిజీ అవుతుండ‌డంతో త‌న కొడుక్కి గైడెన్స్ ఇచ్చే బాధ్య‌త‌ల‌ను మ‌రో సీనియ‌ర్ మంత్రికి అప్ప‌గించిన‌ట్టు టాక్‌. ఆ మంత్రి ఎవ‌రో కాదు చంద్రబాబుకు అత్యంత న‌మ్మ‌క‌స్తుడు అయిన ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు.

లోకేశ్ త‌న శాఖ‌లోని కీల‌క అంశాల‌పై నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు ఉమాను సంప్ర‌దించాల‌ని చంద్ర‌బాబు సూచించార‌ని స‌మాచారం. ఇక చంద్ర‌బాబే చెపితే ఉమా లోకేశ్‌పై మ‌రింత శ్ర‌ద్ధ పెడ‌తార‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు. లోకేశ్ తీసుకునే నిర్ణ‌యాల‌లో లోపాలు ఎత్తిచూప‌డం, త‌న వంతుగా స‌ల‌హాలు ఇవ్వ‌డం, కొన్ని నిర్ణ‌యాల వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వస్తాయి ? లాంటి అంశాల్లో లోకేశ్‌కు ఉమా గైడెన్స్ ఇస్తున్నార‌ట‌. మ‌రి లోకేశ్‌కు ప్ర‌జ‌ల్లోను, ఇటు త‌న శాఖ‌లోను ప‌ట్టు సాధించేందుకు ఉమా ఇచ్చే స‌ల‌హాలు ఎంత వ‌ర‌కు ప‌ని చేస్తాయో చూడాలి.